కరోనా నేపథ్యంలో తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని, అందుకే డ్రంకెన్ డ్రైవ్ చేపట్టడం లేదని వార్తలొచ్చాయి. అయితే దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, టెస్ట్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా భయం ఉన్నప్పటికీ టెస్టులు చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి వేర్వేరు స్ట్రాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేపడుతున్నామని వెల్లడించారు.
అయితే, రాష్ట్రంలో కరోనా భయం ఉన్నందున, దాని ప్రభావం తగ్గే వరకు టెస్టులు నిలిపివేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని విన్నవించారు. దీనిపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై ఆలోచిస్తామని అన్నారు. కరోనా భయం సాధారణ ప్రజల్లోనూ ఎక్కువైనందున ప్రభుత్వం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను రద్దు చేసే అవకాశం లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad news, Telangana, Telangana News, TRAFFIC AWARENESS