సమ్మె విరమించేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతులు విధించకూడదని... అలాగైతేనే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతారని కార్మిక సంఘాల నేత అశ్వత్ధామరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సాయంత్రం ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్‌తో సమావేశానికి ముందు ఆర్టీసీకి చెందిన పలువురు అధికారులతో సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునే క్రమంలో ఎలాంటి షరతులు విధించాలి ? ఎలాంటి షరతులు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై ఆయన అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన ఓ నోట్‌ను కూడా సిద్ధం చేశారని... సీఎం కేసీఆర్‌తో జరిగే సమావేశంలో దీనిపై ఆయన ముఖ్యమంత్రికి వివరణ ఇస్తారని తెలుస్తోంది.
ఆర్టీసీలోని 5,100 రూట్లను ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మళ్లీ కార్మికులు నిరసన తెలిపితే కష్టమవుతుందని... కాబట్టి కార్మికులు విధుల్లో చేరడానికి ముందే షరతులు విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:November 21, 2019, 16:37 IST