Home /News /telangana /

TELANGANA GOVERNMENT HAS TAKEN A CRUCIAL DECISION AND WILL BRING A NEW SCHEME FOR WOMEN FROM NEXT MONTH PRV

KCR | New scheme for women: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళల కోసం కొత్త పథకం.. వివరాలివే..

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

కేసీఆర్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో కొత్త పథకం అమలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

    వచ్చే నెలలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. అదే.. ‘కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్‌ (KCR Nutrition Kit) ’. దీనిపై ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ న్యూట్రియంట్‌ కిట్‌ ఉపయోగపడుతుందని వైద్యవర్గాలు అంటున్నాయి. గర్భం దాల్చాకా మూడో నెలలో ఒకసారి, ఐదో నెలలో మరోసారి దీన్ని అందజేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఇటువంటి పథకం అమలవుతోంది. కొన్ని నెలల క్రితం రాష్ట్రం నుంచి మహిళా ఐఏఎస్​ల బృందం తమిళనాడుకు వెళ్లింది. ‘అమ్మకిట్‌’ పేరుతో అక్కడ అమలవుతున్న పథకం తీరు తెన్నులపై అధ్యయనం చేసింది. అక్కడిలాగే తెలంగాణలోనూ ఓ పథకాన్ని అమలు చేయొచ్చంటూ ప్రభుత్వానికి  (Telangana government)నివేదిక సమర్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు.

    రూ.1,500 కోట్లు ఖర్చు..

    కేసీఆర్‌ కిట్‌ (KCR Kit) లాగానే రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) ఈ పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్‌ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్‌ పోషకాహార కిట్‌ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్‌ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్‌ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు.



    కాగా, ఈ కిట్‌లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు ఖరారయ్యాక న్యూ ట్రీషన్‌ కిట్‌లను మహిళలకు పంపిణీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

    ఏం ఉండనున్నాయి?

    పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్‌ మిక్స్‌ పౌడర్‌ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్‌ సిరప్, ఒక అల్బెండజోల్‌ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్‌ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్‌ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్‌ ఇవ్వాలా లేక కేసీఆర్‌ కిట్‌ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్‌ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు. కాగా, కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kcr, Pregnant women, Telangana Government

    తదుపరి వార్తలు