తెలంగాణ ప్రభుత్వం (Telangana government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు (Government Hospitals) వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు (Medicines) కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా మరో 123 రకాల మందులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తోంది. ఇపుడు ఈ జాబితాను 843కు పెంచింది ప్రభుత్వం. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్)లో 311, ఇతర సాధారణ (అడిషనల్) మందుల జాబితా (ఏఎఎల్)లో 532 మందులు ఉన్నాయి.
మూడు నెలలకు సరిపడా..
అయితే అత్యవసర జాబితాలోని మందులు (Medicines) కావాలంటే ఇప్పటివరకు ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఈ విధానాన్ని కూడా మార్చేసింది ప్రభుత్వం. అత్యవసర జాబితాలోని 311 మందులను ఇక మీద వినియోగం (Usage) ఆధారంగా సేకరించనున్నారు. ప్రతి ఆస్పత్రి కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ జాబితాలోని 532 మందుల్లో 313 మందులను కేంద్రీకృత సేకరణ కింద టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సేకరిస్తుంది. దీనికోసం ఆయా విభాగాల హెచ్‌వోడీలు 9HOD), సూపరింటెండెంట్లు ముందుగానే ఇండెంట్ పెడుతుంటారు. మరో 219 రకాల మందులను డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ కింద ఆస్పత్రులు నేరుగా సేకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మొత్తం 843 రకాల మందుల్లో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా 624 రకాలను సేకరిస్తారు. తెలంగాణలోని ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. మందుల జాబితాను సంస్కరించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. దీనితో ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర జాబితా రూపొందించడంపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసింది.
రోగులకు ఊరట..
మధుమేహం, అధిక రక్తపోటు.. 40 ఏళ్లు దాటాక సుమారు 60 శాతం మందిలో ఈ రెండింటిలో ఒకటైనా కనిపిస్తోంది. ఒక్కసారి వీటి బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. వీటి ఖర్చు మధ్యతరగతి ప్రజలకు భారమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) మందుల ధరలను సవరిస్తూ.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణలకు వాడే అతి ముఖ్యమైన ఔషధాలున్నాయి. ఫలితంగా వినియోగదారుల పై 30-40 శాతం మేర భారం తగ్గనుంది. సవరించిన ధరల మేరకే ఆయా మందులను అమ్మాలని ఉత్పత్తి సంస్థలను ఎన్పీపీఏ ఆదేశించింది. ఇవే ఔషధాలను వేర్వేరు కొత్తగా విపణిలోకి తేవాలనుకుంటే.. ప్రభుత్వ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త ఔషధం పేరిట మందులను ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుకట్ట వేసినట్లయ్యింది. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్ డ్రగ్స్) ధరలకు ముకుతాడు వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.