Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్.. అందరిలోనూ అదే ఉత్కంఠ

ప్రతీకాత్మక చిత్రం

Ganesh Immersion: సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి తెలిపారు. అయితే హుస్సేన్ సాగర్‌లోనే తాము నిమజ్జనం చేపడతామని భాగ్యనగర ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.

  • Share this:
    హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే అంశంపై భాగ్యనగర ఉత్సవ కమిటీ సమితితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి తెలిపారు. అయితే హుస్సేన్ సాగర్‌లోనే తాము నిమజ్జనం చేపడతామని భాగ్యనగర ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు తన తీర్పులో చెప్పలేదని.. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించిందని సభ్యులు అంటున్నారు. ఈ షరతుల అంశాన్ని ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొందరు అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష వైఖరి కారణంగానే పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు.

    మరోవైపు హైకోర్టు తీర్పు వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఉన్నతాధికారులు, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్‌ కూడా హాజరయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. తీర్పుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏ విధంగా చేయాలనే దానిపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. హుస్సేన్ సాగర్ కాకుండా మరో 25 చెరువులను నిమజ్జనం కోసం అధికారులు గుర్తించారని.. ప్రతి వినాయక విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నగరంలో మూడు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

    ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈసారికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఆదేశాలను సవరించాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. దీనిపై తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని ఆదేశించింది. ఇదే అంశంపై గతేడాది కూడా తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము గతంలో ఇచ్చిన అనేక ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ప్రస్తుతం ఈ అంశంలో ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

    Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

    హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వినాయక చవితికి ఒక రోజు ముందు తీర్పునిచ్చింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటిని వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. అది కూడా ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి, అందులో నిమజ్జనం చేయాలని సూచించింది.

    నగరంలో వినాయక విగ్రహాలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనాలు చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో ఎక్కువగా హుస్సేన్ సాగర్‌కే క్యూ కడుతుంటాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: