Telangana: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రేపు సెలవు..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, ఇరిగేషన్, రోడ్డు, భవనాల శాఖల ఉద్యోగులు విధుల్లో ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  • Share this:
    గులాబ్ తుఫాను నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో.. దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేపు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలను వీటి నుంచి మినహాయించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర శాఖలైన రెవెనయూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, ఇరిగేషన్, రోడ్డు, భవనాల శాఖల ఉద్యోగులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్‌ అధికారులకు సూచించారు.

    గులాబ్‌ తుఫాను కారణంగా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది.

    రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వరదలో చిక్కుకున్న వారు కంట్రోల్ రూం నంబర్ 040 23202813 కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

    Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?

    తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: