• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA FORMER HOME MINISTER NAYINI NARASIMHAREDDY PASSES AWAY MS

Nayini Narasimha Reddy: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కన్నుమూత

Nayini Narasimha Reddy: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కన్నుమూత

నాయిని నరసింహారెడ్డి(ఫైల్ ఫొటో)

Nayini narasimhareddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కీలక నేత, పలు కార్మిక ఉద్యమాలతో పాటు ఎన్నో పోరాటాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకుడు, తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి అపోలో ఆస్ప్రతిలో కన్నుమూశారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    తెలంగాణ తొలి హోం శాఖ మంత్రి, మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు కన్నుమూసినట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతనెల 28న కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్నా.. కరోనా అనంతర సమస్యలతో బాధపడ్డ నాయిని.. బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలతో పాటు ఆయనకు న్యూమోనియా కూడా సోకినట్టు వైద్యులు తేల్చారు. ఇన్నాళ్లు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ... ఆయన ప్రాణాలు దక్కలేదు. కాగా, నాయిని మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రమే ఆయన నాయినిని పరామర్శించడానికి ఆస్పత్రికి కూడా వెళ్లిన విషయం విదితమే.

    నాయిని ప్రస్థానం....

    తెలంగాణ రాష్ట్రానికి తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహరెడ్డి.. 1934 మే 12 న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ లకు జన్మించారు. హెచ్ఎసీ వరకు చదివిని నాయిని.. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం జయప్రకాశ్ నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగిన నాయిని.. హైదరాబాద్ లోనే గాక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్మిక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. ఆ క్రమంలోనే 1978, 1985 లలో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపనతో ఆయనతో కలిసి నడిచారు.

    టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తుదిశ్వాస విడిచేదాకా ఆ పార్టీలోనే కొనసాగారు. కేసీఆర్ కు ఆయన కు దగ్గరి సంబంధాలున్నాయి. 2004 లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అప్పుడు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తొలి పాలనలో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు.

    కాగా, నాయిని మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం టీఆర్ ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక లోకానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చిరకాల మిత్రుడిని కోల్పోయానని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు