హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Formation Day | ఆరేళ్ల తెలంగాణ.. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..

Telangana Formation Day | ఆరేళ్ల తెలంగాణ.. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..

తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి.

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు పయనించింది? అభివృద్ధి తీరు ఎలా ఉంది? స్వరాష్ట్ర పాలనలో విస్మరించినవి ఏంటి? అని ఆరా తీస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో కళకళ లాడుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రానికి వెన్నెముకలా మారాయి.

ఇక, రైతు బంధు దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. రైతు బీమా, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి దిక్సూచిలా మారింది. అటు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది.

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం ఉండేలా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ & సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (TS-IPASS) చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశ పెట్టింది. విద్యాపరంగానూ రాష్ట్రం అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. కొత్తగా 661 ( 608 స్కూళ్లు + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 959 (906+53డిగ్రీ కాలేజీలు)కి తీసుకువచ్చింది.

అయితే, నియామకాలను కల్పించడంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం విఫలమైందనే చెప్పాలి. ఆరేళ్లలో తగిన నియామకాలు జరగలేదనే అనాలి. తెలంగాణలో 2.86 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా.. ఈ ఆరేళ్లలో 27 వేలకుపైగా మాత్రమే ఖాళీల భర్తీ జరిగిందని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. అంతేకాదు.. సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంపై అప్పుల భారం కొండలా పెరిగిపోయింది. అయితే, ఈ సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

First published:

Tags: CM KCR, Telangana News

ఉత్తమ కథలు