హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Formation Day: మన ఎనిమిదేళ్ల తెలంగాణ.. దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

Telangana Formation Day: మన ఎనిమిదేళ్ల తెలంగాణ.. దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్‌లోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్‌లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. రాబోయే రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టబోతున్నారో వెల్లడించారు. త్వరలోనే గ్రామాల్లో పల్లె దవాఖానా (TS Village Hospitals)తో పాటు క్రీడా ప్రాంగణాల (Village Sports Grounds) ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

'' పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్నాయి. భవిష్యత్ తరాలు శరీర దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే ఎంపిక చేసిన కొన్ని గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తోంది.'' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Telangana@8: తెలంగాణకు ఎనిమిదేళ్లు.. అప్పుడెలా ఉంది? ఇప్పుడేం సాధించింది?

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. తనతో పాటు ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసినా.. పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని.. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని విరుచుకుపడ్డారు. దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదని... దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

'' ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొంది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకుంది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతోంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తోంది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తోంది. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తుంది.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.


KCR| BJP: ఆ విషయంలో కేసీఆర్ లెక్క తప్పిందా ?.. బీజేపీని తక్కువగా అంచనా వేశారా ?

రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయిందని విమర్శించారు సీఎం కేసీఆర్. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

First published:

Tags: CM KCR, Telangana, Telangana Formation Day, Trs

ఉత్తమ కథలు