Telangana Floods: గోదావరిలో చిక్కుకున్న రైతులు, ఎట్టకేలకు బయటపడ్డారిలా

గోదావరిలో చిక్కుకున్న రైతులను కాపాడిన గ్రామస్తులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సదర్మాట్ ప్రాంతంలో గోదావరి నదిలో నీటి ఉధృతి పెరిగి ఇద్దరు కౌలు రైతులు అందులో చిక్కుకుపోయారు.

 • Share this:
  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సదర్మాట్ ప్రాంతంలో గోదావరి నదిలో నీటి ఉధృతి పెరిగి ఇద్దరు కౌలు రైతులు అందులో చిక్కుకుపోయారు. పోలీసులు, గ్రామస్థులు తీవ్రంగా శ్రమించి తాళ్ళ సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మల్లాపూర్ మండలం సిర్పూర్ కు చెందిన మల్లయ్య, తిరుపతి అనే ఇద్దరు కౌలు రైతులు ఎప్పటి లాగే గోదావరి పాయ దాటి కుర్రు ప్రాంతంలో ఉన్న తమ పంట పొలాలకు కాపాలాగా వెళ్ళారు. అడవి పందుల బారి నుంచి తమ పంటను కాపాడుకోవడం కోసం ప్రతిరోజు కాపాల వెళుతుంటారు. అలా వెళ్ళిన రైతులు రాత్రి అక్కడె కాపాలా ఉండి ఉదయం తిరుగుముఖం పట్టగా ఒక్కసారిగా గోదావరి నదిలో నీటి ఉధృతి పెరిగిపోయింది. వరదలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటు గడిపారు. చివరకు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ తో సర్పంచ్ కు సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి అక్కడి వచ్చి ఈత గాళ్లు, తాళ్ళ సహాయంతో ఇద్దరు రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారు సురక్షితంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

  రెండు రోజుల క్రితం ఇలాగే మెదక్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులు ప్రమాదకర వరద కారణంగా నది మధ్యలో చిక్కుకున్నారు. దీంతో మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తక్షణమే స్పందించారు. హైదరబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించి, జిల్లా పోలీస్ సిబ్బంది సహాయంతో ఐదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

  గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కుల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్ నందు పనిచేసే 5గురు వ్యక్తులు బోయిని నాగరాజు( పైతర గ్రామం), పోతుల శ్రీధర్ (గంగాపూర్ గ్రామం), గుడాల దుర్గా ప్రసాద్ (జానకంపల్లి), సిద్దుల మహేష్(కిష్టాపూర్) మరియు హైదరాబాద్ కి చెందిన కుమారు కొమరయ్యలు పనిలో భాగంగా ఫామ్ హౌస్ వెళ్ళగా, ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా, సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పామ్ హౌస్ కు వెళ్ళే దారిలో వున్న మంజీర నది పాయల బ్రిడ్జి మునిగిపోయింది. వారు బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు. ఉదృతంగా మంజీర నది పాయల ప్రవహిస్తుండడంతో విషయం తెలుసుకున్న మెదక్ డి.ఎస్.పి. పి. క్రిష్ణమూర్తి వెంటనే మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. డి. జోయల్ డేవిస్ దృష్టికి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. వెంటనే స్పందించి హైదరాబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించారు. మెదక్ డి.ఎస్.పి, మెదక్ రూరల్ సి.ఐ. పాలవెల్లి, కుల్చారం ఎస్.ఐ. శ్రీనివాస్ గౌడ్ , ఇతర శాఖ అధికారుల సమన్వయంతో వరదలో చిక్కుకున్న వారిని ఆర్మీ రెస్క్యూ బృందం హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంధర్భంగా మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమై ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీస్ అధికారులు, ఆర్మీ రెస్క్యూ బృందం, పోలీస్ సిబ్బందిని అభినందించారు. అలాగే పోలీస్ సిబ్బంది, ఆర్మీ రెస్క్యూ బృందం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదలో చిక్కుకున్న తమ ప్రాణాలను కాపాడినందుకు ఆ ఐదుగురు కృతజ్ఞతలు తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: