మహబూబ్నగర్: ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదని రైతుల కష్టాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల ఏపీలో ఓ రైతు ట్రాక్టర్ కు కూలీ ఇచ్చే స్థోమత లేక తన కూతుళ్లతో అరక దున్నించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను చూసి సినీ నటుడు సోనూసూద్ స్పందించిన వారికి ఆర్థికసాయం చేశాడు. తాజాగా అచ్చం అలాంటి కష్టాన్నే తెలంగాణకు చెందిన ఓ రైతు అనుభవిస్తున్నాడు. పంటల్లో వరుస నష్టాలకు తోడు, నీటి కోసం ఎక్కువ సార్లు బోర్లు వేయడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చేతిలో డబ్బుల్లేక కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చి వ్యవసాయ పనులను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని దోరెపల్లి గ్రామంలో శివగారి పెద్ద రాములుది వ్యవసాయ కుటుంబం. ఆయనకు రెండున్నరెకరాల పొలం ఉంది. ఆరుపదుల వయసులో కూడా ఆ రైతు వ్యవసాయ పనులను ఆపలేదు. తన ఇద్దరు కొడుకులతో కలిసి రోజూ పొలానికి వెళ్తుంటాడు. పొలం పనుల్లో సాయం చేస్తుంటాడు. అతడికి ఉన్న రెండున్నరెకరాల పొలంలో పదిసార్లు బోర్లు వేస్తే పదకొండోసారి నీళ్లు పడ్డాయి. అన్నిసార్లు బోర్లు వేయడంతో అప్పులు కూడా అధికం అయ్యాయి. ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. కూలీలను పిలిస్తే ఇచ్చేందుకు డబ్బులు లేక వాళ్లే పనులన్నీ చేసుకునేవారు. సాగు కోసం కాడెద్దులను కూడా కొనలేకపోయాడు.
పదకొండోసారి ప్రయత్నంలో నీళ్లయితే పడ్డాయి కానీ, వ్యవసాయానికి కాడెద్దులు మాత్రం లేవు. వేరే వాళ్ల దగ్గర తెచ్చుకున్నా, అందుకు ప్రతిగా ఇచ్చేందుకు డబ్బులు లేవు. అందుకే విధి లేక కొడుకుల్ని కాడెద్దులుగా చేసి గొర్రును లాగిస్తూ కరిగెట చేయిస్తున్నాడా రైతు. రాములు చూసిన కష్టం చూసి స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన భూమిని, వ్యవసాయాన్ని వదులుకోలేక రాములు కష్టాన్ని చూసి ప్రభుత్వమే అతనికి సాయం చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు నిరుపేద రైతులకే చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Farmers suicide