Home /News /telangana /

ESI Scam: ఈడీ సోదాలు.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో భారీ నగదు..

ESI Scam: ఈడీ సోదాలు.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో భారీ నగదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

    ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారు. శనివారం ఉదయం నుంచి 10కిపైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు, విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌ రెడ్డి, నాయిని మాజీ పీఎస్‌ ముకుందారెడ్డి బంధువు వినయ్‌ రెడ్డి, నిందితురాలు దేవికా రాణి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి ఇళ్లలో భారీగా నగదు, నగలు లభించాయి.

    ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి ఇంట్లోనూ నగలు, నగదును ఈడీ స్వాధీనం చేసుకున్నారు. ఈ డొల్ల కంపెనీల వెనుక కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ప్రస్తుతం ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

    ఇక, తెలంగాణలో ఈఎస్ఐ మందుల కుంభకోణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ డైరక్టర్ అయిన దేవికారాణితో పాటు ఏసీబీ పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేసి విచారించింది.వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కుంభకోణంలో కీలక నిందితురాలు దేవికారాణి అక్రమార్జనలో భాగమైన రూ.4.47 కోట్ల సొమ్మును గతేడాది సెప్టెంబరులో ఏసీబీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏసీబీ న్యాయస్థానం అనుమతి తీసుకుంది. అయితే ఈ కేసులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. విదేశాలకు నగదు బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Enforcement Directorate, Esi scam, Hyderabad, Nayini narasimha reddy

    తదుపరి వార్తలు