వరద బాధితులకు ఉద్యోగుల సాయం.. పర్మినెంట్ దసరా గిఫ్ట్ ఇచ్చిన సీఎం కేసీఆర్

దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

news18-telugu
Updated: October 23, 2020, 7:04 PM IST
వరద బాధితులకు ఉద్యోగుల సాయం.. పర్మినెంట్ దసరా గిఫ్ట్ ఇచ్చిన సీఎం కేసీఆర్
కేసీఆర్(ఫైల్ ఫొటో)
  • Share this:
వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్లను ప్రభుత్వానికి సహాయంగా అందించే ఆమోదపత్రాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు. కేసీఆర్ ను కలిసిన వారిలో టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణ, టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు.

డీఏ విషయంలో విధానం మార్చాలి: సీఎం

ప్రస్తుతం అనుసరిస్తున్న డీఏ విషయంలో విధానం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ‘ప్రస్తుతం డీఏ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డీఏల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డీఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలి. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5 గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం వెల్లడించారు.

2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే, తుది నివేదిక రావాల్సి ఉంది. తెలంగాణలో మొత్తం రూ.8633 కోట్ల విలువైన పంటలు నష్టపోయాయని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే రోడ్లు కొట్టుకుపోవడం వల్ల రూ.222 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కలు వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.567 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాధమికంగా అంచనా వేసింది ప్రభుత్వం.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading