news18-telugu
Updated: December 3, 2018, 9:32 PM IST
ఉత్తమ్ కుమార్ (ఫైల్ ఫోటో)
తెలంగాణలో ఎవరు గెలవబోతున్నారు? ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. అన్ని చోట్లా దీనిపైనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు రోజుకో ప్రిపోల్ సర్వే బయటకు రావడంతో జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఐతే ఒక సర్వేకు మరో సర్వేకు మధ్య కనీస పొంతన లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ సోమవారం ప్రసారం చేసిన ఓ సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ 100పై స్థానాలను గెలవబోతోందని CPS అనే సంస్థ జోస్యం చెప్పింది. ఐతే అదంతా బోగస్ సర్వే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ మండిపడ్డారు. ప్రైమ్‌టైమ్‌లో చెత్త సర్వేలు ప్రసారం చేస్తారా? అంటూ సదరు టీవీ ఛానెల్‌పై ఫోన్లో ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇది బోగస్ సర్వే. మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. మీది చెత్త ఛానెల్. వారికి 100 సీట్లు రాకుంటే ఛానెల్ మూసేస్తారా? మిమ్మల్ని ఎవరు నమ్మరు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. నేనే సీపీఎస్ సంస్థ పేరే వినలేదు. ప్రైమ్‌టైమ్‌లో ఇలాంటి సర్వే చేయడం దుర్మార్గం. మీ ఛానెల్ యాజమాన్యాన్ని కేసీఆర్ ఒత్తిడి పెడుతున్నారు. ప్రజాకూటమి 85 సీట్లను సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.
— ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్
సీపీఎస్ సర్వే వివరాలు
తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు (119)
టీఆర్ఎస్ 94-104
ప్రజాకూటమి 16-21
ఎంఐఎం 07 బీజేపీ 1-2
ఇతరులు 0-1
సీపీఎస్ సర్వేపై సదరు మీడియా ఛానెల్లో చర్చా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఫోన్లైన్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్.. సర్వేపై మండిపడ్డారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని..ఈ సమయంలో ప్రజలను ప్రభావితం చేసేందుకు ఇలాంటి తప్పుడు సర్వేలు ప్రసారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 3, 2018, 9:10 PM IST