గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Telangana Elections 2018 | శుక్రవారం పోలింగ్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

news18-telugu
Updated: December 5, 2018, 6:21 PM IST
గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
గ్రేటర్ హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సజ్జనార్, మహేశ్ భగవత్
  • Share this:
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. శుక్రవారం పోలింగ్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకున్న భద్రతా చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్‌ భగవత్‌లు మీడియాకు వివరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు.

సైబరాబాద్‌ కమిషనరేట్: ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి​చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో శుక్రవారం రోజున జరిగే పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో 2,867 పోలింగ్‌ కేంద్రాలు, 152 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లుపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. 21 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 12 వేల మందితో భద్రతా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సైబరబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.2.29 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తిన 9490617444 నంబర్‌కు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఓటింగ్ రోజున పోలింగ్‌ కేం‍ద్రాల లోపలికి సెల్‌ఫోన్‌ అనుమతి లేదని సజ్జనార్ స్పష్టం చేశారు.

sajjanar, mahesh bhagat, cyberabad cp, rachakonda cp
గ్రేటర్ హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సజ్జనార్, మహేశ్ భగవత్


రాచకొండ కమిషనరేట్: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 13 శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మొత్తం 3073 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైన 517 పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాల వద్ద 2 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 11 చెక్‌ పోస్టులు, 27 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 27 పోలింగ్ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకు రూ.2.27 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే నెంబర్.9490617111కి ఫోన్ చేయాలని సూచించారు.

hyderabad cp, anjani kumar, telangana election, hyderabad security
మీడియాతో మాట్లాడుతున్న హైదరాబాద్ సీపీ అంజని కుమార్


హైదరాబాద్‌: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. 1,574 పోలింగ్ ప్రాంతాల్లోని 3,911 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 161 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని, ఇక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వివరించారు. నోడల్ అధికారులుగా 15 మంది ఏసీపీ ర్యాంకు ఆఫీసర్లు వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం 60 షాడో టీమ్‌లు పనిచేస్తాయని వివరించారు.

ఇప్పటివరకు రూ.27.3 కోట్ల రూపాయల నగదు, రూ.2.41 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఎన్నికల రోజు ప్రత్యేకంగా 518 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ కోసమే ప్రత్యేకంగా 10 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. అసాంఘికశక్తులతో పాటు రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామని తెలిపారు.
Published by: Janardhan V
First published: December 5, 2018, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading