తెలంగాణ‌ ఎన్నికలు: పెరగనున్న ఓటింగ్ శాతం..పార్టీల లెక్కలు

Live Updates Telangana Assembly poll 2018 | తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 75-80 శాతం మేర పోలింగ్ నమోదుకావచ్చని అంచనావేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న లెక్కల్లో రాజకీయ పార్టీల నేతల తలమునకలై ఉన్నారు.

news18-telugu
Updated: December 7, 2018, 2:22 PM IST
తెలంగాణ‌ ఎన్నికలు: పెరగనున్న ఓటింగ్ శాతం..పార్టీల లెక్కలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 7, 2018, 2:22 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 41.96 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 2 గం.ల వరకు దాదాపు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.  ప్రస్తుత ఓటింగ్ సరళిని పరిశీలిస్తే 2014 ఎన్నికలకంటే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 75 శాతానికి అటు, ఇటుగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభిస్తుందన్న లెక్కల్లో రాజకీయ పార్టీలు తలమునకలై ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడంతో తమకు కలిసి వస్తుందని రాజకీయ పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

పోలింగ్ ప్రశాంతం...5 గం.ల వరకు పోలింగ్

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యింది. ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం జాప్యం అయ్యింది. అయితే ఎన్నికల అధికారులు వాటిని సరిచేసి పోలింగ్ చేపట్టారు. సాయంత్రం 5 గం.ల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గం.ల లోపు క్యూలైన్లలో నిల్చొని ఉన్న ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల అధికారులకు సీఈవో రజత్ కుమార్ ఇప్పటికే ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల పండుగ సందడిఉదయం నుంచే ప్రజలు భారీ క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయాన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం పట్ల ఓటర్లు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ఎన్నికల అధికారులు వాటిని సరిచేశారు. పలుచోట్ల తమకు ఓటరు స్లిప్‌లు అందలేదంటూ హైదరాబాద్ నగరంలోని ఓటర్లు నిరుత్సాహం వ్యక్తంచేశారు.  అటు కొన్నిచోట్ల ఓటరు గుర్తింపుకార్డు ఉన్నా ఓటరు జాబితాలో తమ పేరు లేకపోవడంతో కొందరు నిరుత్సాహం వ్యక్తంచేశారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాన్యుల్లా క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటువేసిన ప్రముఖులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, ఆయన సతీమణి సోమాజిగూడ రాజ్ నగర్‌లోని ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రం పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పోచారం తదితరులు, ప్రజా కూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం తదితరులు, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Loading...
ఓటు వేసిన సినీ సెలబ్రిటీలు

అలాగే సినీ సెలబ్రిటీలు చిరంజీవి, ఎస్ఎస్ రాజమౌళి, రానా, మహేశ్ బాబు-నమ్రత, రాఘవేంద్రరావు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కృష్ణ దంపతులు, వెంకటేశ్, నాగార్జున, అమల, శ్రీకాంత్ దంపతులు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు తమ ఓటు మక్కును వినియోగించుకున్నారు. క్రీడా ప్రముఖులు సానియా మిర్జా, పీవీ సింధు తదితరులు హైదరాబాద్‌లో ఓటు వేశారు. తన పేరు ఓటరు జాబితాలో గల్లంతుకావడం పట్ల బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల విస్మయం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు పిలుపునిచ్చారు.

చదురుమదురు ఘటనలు

పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చదురుమదురు ఘటనలు మినహా మధ్యాహ్నం వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. అటు పోలింగ్ వేళ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు‌కు గుండెపోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారం మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన స్వామి (55) ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్‌ బూత్‌లోనే ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశాడు.
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...