తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం..ప్రలోభాలు షురూ

Telangana Elections 2018 | తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 42 మంది పోటీ చేస్తున్నారు. బాన్స్‌వాడలో అత్యల్పంగా ఆరుగురు బరిలో ఉన్నారు.

news18-telugu
Updated: December 5, 2018, 6:11 PM IST
తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం..ప్రలోభాలు షురూ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైకులు మూగబోయాయి. ప్రచార రథాలు ఆగిపోయాయి. సుమారు 2 నెలల పాటు పార్టీల ప్రచారంతో హోరెత్తిన తెలంగాణలో..ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు పార్టీల ప్రకటనలపై ఈసీ నిషేధం విధించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ తరఫున ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవిత తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. అటు ప్రజాకూటమి తరఫున యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు జాతీయ నేతలు టీజేఎస్ అధినేత ప్రొ.కోదండరామ్, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ, ప్రజా గాయకుడు గద్దర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అటు కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కూడా జాతీయ స్థాయి నేతలను తెలంగాణలో మోహరించింది. అటు ఎన్నికలకు సినీ గ్లామర్‌ను అద్దుతూ ప్రజా కూటమి అభ్యర్థుల తరఫున విజయశాంతి, బాలకృష్ణ, కుష్బు, నగ్మా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్,మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు తదితరులు ప్రచారం నిర్వహించారు. కర్ణాటక మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ తెలంగాణ నేతలు కే.లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత్రి మాయావతి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు సీపీఎం నేతృత్వంలో బీఎల్ఎఫ్ కూటమి తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు.

కొన్ని నియోకవర్గాల్లో బలమైన బీజేపీ అభ్యర్థులు,  టీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. వీరు తమతమ నియోజకవర్గాల్లో అంతా తామై ప్రచారం చేపట్టారు. బలమైన బీజేపీ అభ్యర్థులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలుస్తున్న స్థానాల్లో   త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంటోంది.


ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడం, రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం, లగడపాటి సర్వేపై లడాయి వంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రచారం పరిసమాప్తం...ప్రలోభాలు షురూ

ప్రచార ఘట్టం పరిసమాప్తం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రలోభాలను, తెరచాటు రాజకీయాలను పార్టీలు షురూ చేశాయి. మద్యం, ధనం రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో ఈ పార్టీ...ఆ పార్టీ అని లేకుండా అందరి మధ్య పోటాపోటీ నెలకొంటోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఎన్నికల సంఘం...మద్యం, నగదు పంపిణీని కట్టడి చేయడంపై దృష్టిసారించారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముమ్మర వాహనాలను తనిఖీలు చూస్తున్నారు.

బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం..మద్యం షాపులు బంద్తెలంగాణలో శుక్రవారం పోలింగ్ జరనున్న నేపథ్యంలో బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం విధించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నిషేధం ఉంటుందని తెలంగాణ డీజీపీ ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు మద్యం దుకాణాలు, బార్‌లు, మిలటరీ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలపైనా బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నిషేధం విధించారు.

తెలంగాణ ఓటరు నాడి పట్టలేని సర్వేలు

తెలంగాణ ఓటర్ల నాడిపడ్డడం ఎవరితరం కావడం లేదు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రకమైన సర్వే ఫలితాలతో జనాన్ని తికమకపెడుతున్నాయి.  ఓటర్లు తమవైపే ఉన్నారని, తమ సర్వేల్లో ఇదే తేలిందంటూ టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు ఎవరికి వారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం(డిసెంబరు7) పోలింగ్ జరగనుండగా...ఓటర్లు ఏ గట్టును నిలిచారో తెలియాలంటే డిసెంబరు 11 వరకు వేచిచూడాల్సిందే.


Published by: Shiva Kumar Addula
First published: December 5, 2018, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading