Telangana Eamcet Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల...

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల...

Telangana Eamcet Result: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇంజినీరింగ్‌లో 82 శాతం క్వాలిఫై అవ్వగా.., అగ్రికల్చర్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • Share this:
    Eamcet Result: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి కలిసి... ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ (telangana) వ్యాప్తంగా ఈనెల 4,5,6, తేదీల్లో ఎంసెట్ (Eamcet) ఇంజినీరింగ్ నిర్వహించారు. కరోనా కారణంగా ఈసారి ఎంసెట్‌ను తొమ్మిది దశల్లో నిర్వహించారు. ఆ ఫలితాలను ఇప్పుడు విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించినట్లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఈ నెల10న విడుదల చేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు.

    గత మూడేళ్లతో పోల్చితే ఈ సవత్సరం 28,000 మంది విద్యార్థులు అధికంగా పరీక్ష రాశారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ను 1,47,991 మంది విద్యార్థులు రాయగా... వారిలో 1,21,480 మంది క్వాలిఫై అయ్యారు. ఫలితంగా 82.08 శాతం క్వాలిఫై అయినట్లైంది. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లో 79,009 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 73,070 మంది అర్హత సాధించారు. ఫలితంగా 92.48 శాతం మంది క్వాలిఫై అయినట్లైంది. ఇంజినీరింగ్‌‌లో మొదటి ర్యాంక్‌ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ పొందగా... రెండో ర్యాంక్... కడప రాజంపేటకుచెందిన వెంకట నరేష్‌ పొందాడు. ఇక మూడో ర్యాంక్‌ హైదరాబాద్‌కి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌, నాలుగో ర్యాంక్‌ నల్గొండకు చెందిన రామస్వామి, ఐదో ర్యాంక్‌... కూకట్ పల్లికి చెందిన వెంకట ఆదిత్య పొందారు. అగ్రికల్చర్‌ అండ్ మెడికల్‌ విభాగంలో... మొదటి ర్యాంకును హైదరాబాద్‌కి చెందిన... మండవ కార్తికేయ పొందగా... రెండో ర్యాంకును రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమాని శ్రీనీజ సాధించారు.. మూడో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన కౌశల్‌ రెడ్డి పొందారు. క్వాలిఫై అయిన విద్యార్థులు... తెలంగాణలోని వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందుతారు. ఎంసెట్‌కు సంబంధించి అభ్యర్థులు అప్ డేట్ల కోసం https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx వెబ్ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

    ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుందని, ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందనీ, సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారని సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.

    ఎంసెట్ రిజల్ట్ వచ్చిన కారణంగా అధికారులు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను (inter exams ) రద్దు చేసిన కారణంగా.. ఇంజనీరింగ్ (Engineering) సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇది కూడా చదవండి: అమ్మాయిలూ అలర్ట్.. ప్రేమలో పడుతున్నారా? కేరళలో ఏమవుతోందంటే!

    కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. దీంతో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పరీక్షల రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు.
    Published by:Krishna Kumar N
    First published: