Home /News /telangana /

Huzurabad: సీఎం కేసీఆర్ సభలో 15 మందికి దళిత బంధు డబ్బులు.. లబ్ధిదారుల ఎంపికపై దుమారం

Huzurabad: సీఎం కేసీఆర్ సభలో 15 మందికి దళిత బంధు డబ్బులు.. లబ్ధిదారుల ఎంపికపై దుమారం

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Dalitha Bandhu Scheme: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు సాయం అందుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇంకా చదవండి ...
  ఇప్పుడు తెలంగాణ అంతటా హుజురాబాద్ ఉపఎన్నికలు, దళిత బంధు పథకం గురించే చర్చ జరుగుతోంది. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాల్గొనబోయే ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు అక్కడ ఉండి ఏర్పట్లను సమీక్షిస్తున్నారు. హుజురాబాద్‌లో దళిత బంధు తొలి లబ్ధిదారులుగా 15 మందిని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై కరీంనగర్ జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రి వరకూ జాబితా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ ఈ జాబితాను పంపనున్నారు.

  ఆగస్టు 16న శాలపల్లి గ్రామంలో జరగనున్న సభలో వారికి సీఎం కేసీఆర్ స్వయంగా వారికి దళిత బంధు చెక్కులను అందజేయనున్నారు. ఐతే అర్హులైన వారికి కాకుండా టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాలనే లబ్ధి దారులుగా ఎంపిక చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు దళిత కుటుంబాలు రెండు రోజులుగా హుజూరాబాద్‌లో ఆందోళన చేస్తున్నాయి. దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు సాయం అందుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఐతే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ టీచర్లపై పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దళిత బంధు సభకు జనాలను తరలించే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ కరీంనగర్ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీచేశారు.

  సీఎం కేసీఆర్ హుజురాబాద్‌ పర్యటనకు ప్రజలను బస్సుల్లో తరలించే బాధ్యతను ఎంఈవోలు, జీహెచ్‌ఎంలు, కోఆర్డినేటర్లు చూసుకోవాలంటూ ఆదేశించారు. వారిని స్పెషల్‌ ఆఫీసర్లుగా పేర్కొన్నారు. మరో 150 మందిని రూట్‌ ఆఫీసర్లుగా నియమించుకోవాలని డీఈవో సూచించారు. జనసమీకరణ, తరలింపు, కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేదుకు శనివారం మధ్యాహ్నం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని స్పష్టం చేశారు. డీఈవో జారీ చేసిన ఈ ఉత్తర్వులపై ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విపక్ష నేతలు మండిపడుతున్నారు. జనసమీకరణ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పగించడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు.  మరోవైపు హుజురాబాద్‌లో ఉపఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలతో ఓటర్లను సంపన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ నియోజకవర్గంలోనే ఉండి తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉద్యమ నేపథ్యమున్న టీఆర్ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Dalitha Bandhu, Huzurabad, Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు