Telangana: కరోనా సోకిందని ఊరిలోకి రానివ్వలేదు.. ఊరి చివరన పొలంలోనే యువతి.. అసలు ఏం జరిగిందంటే..

ఊరి వెలుపల పొలంలో ఏర్పాటు చేసిన గుడిసెలో విద్యార్థిని

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ ఇంటర్ విద్యార్థినిని గ్రామంలోకి అనుమతించేందుకు నిరాకరించారు ఓ ఊరి జనాలు.

  • Share this:
    కరోనా సోకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. బాలిక కారణంగా ఊరిలో మిగతావారికి కరోనా వ్యాపిస్తుందేమోనన్న భయంతో ఆమెను ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆమె గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గుడిసెకే పరిమితమైంది. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్‌దేవి నిర్మల్ జిల్లాలోని Tribal Welfare Residential Collegeలో ఇంటర్ చదువుతుంది. అయితే అక్కడ చదువుతున్న పలువురు విద్యార్థులకు కరోనా సోకింది. అందులో సోన్ దేవి కూడా ఉంది. కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ఆమె గ్రామానికి వచ్చింది. అయితే గ్రామస్తులు ఆమెను ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని వారి పొలంలో ప్రత్యేకంగా గుడిసె ఏర్పాటు చేసి.. బాలికను అందులో ఉంచారు. దీంతో బాలిక ఆ గుడిసెలోనే ఐసోలేషన్‌లో ఉంటుంది.

    పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి కూడా అక్కడే కాలం వెల్లదీస్తుంది. ఈ విషయం తెలిసిన అధికారులు సోమవారం సాలేగూడకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్‌, గురుకులం ఆర్‌సీఓ గంగాధర్‌లు గ్రామ శివారులో గుడిసెలో ఉంటున్న బాలికను పరామర్శించారు. ఆమెను గ్రామంలోకి అనుమతించాలని గ్రామ పెద్దలతో మాట్లాడారు. అయితే ఫలితం లేకుండా పోయింది. బాలికను గ్రామంలోకి అనుమతించేందుకు వారు అనుమతించలేదు. మరో నాలుగు రోజులు అయితే ఆమె క్వారంటైన్ పూర్తవుతుందని.. అప్పుడు మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని వారు అన్నారు. దీంతో బాలిక మరికొంత కాలం గుడిసెలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఇక, బాలిక ఉంటున్న గుడిసెకు కొద్ది దూరంలో ఆమె తండ్రి నివసిస్తున్నాడు. కూతురిని చూసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఇక, మిగతా కుటుంబ సభ్యులు వారికి ఆహారం అందజేస్తున్నారు. అయితే కరోనా సోకిన బాలికను ఇలా గ్రామ శివార్లలోని గుడిసెలో ఉంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యే వరకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్‌కైనా తరలించాలని వారు అంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: