TELANGANA CONGRESS PRESIDENT REVANTH REDDY FOLLOWING YS RAJASHEKAR REDDY FOOTSTEPS IN GROWING CONGRESS AK
Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆ నేతనే ఫాలో అవుతున్నారా ?.. అదే కరెక్ట్ అని నమ్ముతున్నారా ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana Congress: కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లి తన బలం, కాంగ్రెస్ బలం పెరిగేలా చేసుకునేందుకు ఆయన వ్యూహరచన చేసుకున్నారని.. ఈ క్రమంలోనే పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి గళాలలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక తరువాత కాంగ్రెస్ పార్టీలో కొంతమేరకు జోష్ కనిపించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉంటే అంతర్గత కలహాలు ఈ మధ్య ఆ పార్టీని మరింత ఎక్కువగా వేధిస్తున్నాయి. దీంతో ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి ఏ విధంగా అధిగమిస్తారనే అంశంపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎదగాలంటే అధిష్టానం అండదండలు ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో ప్రజల్లోనూ బలం పెంచుకోవడం అంతే ముఖ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే రకమైన ఫార్ములాను ఫాలో అయ్యారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో పాటు ప్రజల్లో బలం పెంచుకోవడంపై వైఎస్ఆర్ ఎప్పుడూ ఫోకస్ చేసేవారు. అప్పుడప్పుడు అధిష్టానంతో విభేదించినా.. ప్రజల్లో ఉన్న బలం ఆయనకు కలిసొచ్చేది. పార్టీలోనూ ఆయనను అదే నంబర్‌వన్‌గా నిలిపింది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఫార్ములానే ఫాలో అవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసమ్మతిని తట్టుకున్నారు. ప్రజల్లో బలం పెంచుకుని, పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఈ అసమ్మతి ప్రభావం తనపై ఏ మాత్రం ఉండదని వైఎస్ఆర్ బలంగా నమ్మేవారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లి తన బలం, కాంగ్రెస్ బలం పెరిగేలా చేసుకునేందుకు ఆయన వ్యూహరచన చేసుకున్నారని.. ఈ క్రమంలోనే పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి గళాలలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఆయన ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని సమాచారం. అందుకే ఎలాంటి అసమ్మతి ఎదురైనా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగడం నేర్చుకున్నారని ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజాబలం పెంచుకునే క్రమంలోనే.. పార్టీలో తన అనుచరవర్గాన్ని కూడా రేవంత్ రెడ్డి పెంచుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా వ్యవహరించారని... అలా వైఎస్ఆర్ అనుచరులుగా పేరున్న నేతలే ఎక్కువగా జగన్ వెంట నడిచారని పలువురు చెబుతుంటారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎదగాలంటే వైఎస్ఆర్ ఫార్ములా ఒక్కటే కరెక్ట్ అని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.