Hath se hath jodo yatra 2023 : ఇన్నాళ్లూ... సభలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమైంది. అందులో భాగంగా.. పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి.. తన ఇంటి నుంచి మేడారంకి బయలుదేరారు. ఆయన కూతురు ఆయనకు హారతి ఇచ్చి... ఆల్ ది బెస్ట్ చెప్పారు.
నేడు కాంగ్రెస్ ... హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ప్రారంభిస్తోంది. తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర అవుతామని కాంగ్రెస్ భావిస్తోంది.
షెడ్యూల్ పరిశీలిస్తే.. రేవంత్ రెడ్డి ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. ముందుగా మేడారం నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకూ పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం తింటారు. తర్వాత 2.30కి మళ్లీ పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 5 గంటలవరకూ ఇది సాగుతుంది. ఆ తర్వాత పస్రా జంక్షన్‌లో ఓ గంటపాటూ కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే పాల్గొంటారు. కొన్ని కీలక సూచనలు చేస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రామప్ప చేరుకోవడంతో తొలి రోజు పాదయాత్రను ముగిస్తారు. తిరిగి రేపు పాదయాత్ర కొనసాగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాదయాత్రలు ఉంటాయి. సీనియర్ నేతలు వివిధ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్రలు చేపడతారు. తద్వారా ప్రజల్లోకి పార్టీని మరింతగా తీసుకెళ్లడంపై ఫోకస్ పెడతారు. ఈమధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ల తీరుపై జూనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పంచాయతీ ఏకంగా ఢిల్లీ వరకూ వెళ్లింది. దీన్ని చల్లార్చేందుకు హైకమాండ్ దిగ్విజయ్ సింగ్‌ని రంగంలోకి దింపి.. మంతనాలు జరిపించింది. ఆ తర్వాత అంతర్గత విభేదాలు సద్దుమణిగాయి. అందువల్ల ఈ పాదయాత్ర కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం తెస్తుందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.