Home /News /telangana /

TELANGANA CONGRESS NEW INCHARGE MANIKAM TAGORE COMMENTS ON TPCC PRESIDENT CHANGE AK

Telangana Congress: టీపీసీసీ చీఫ్ మార్పు.. తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ కాంగ్రెస్‌కు మణికం ఠాగూర్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా రావడంతో.. టీపీసీసీ చీఫ్ మార్పు కూడా ఉంటుందని చాలామంది భావించారు.

    టీపీసీసీ చీఫ్ పదవి మార్పు ఎప్పుడు ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తెలంగాణకు మణికం ఠాగూర్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా రావడంతో.. టీపీసీసీ చీఫ్ మార్పు కూడా ఉంటుందని చాలామంది భావించారు. అయితే ఈ అంశంపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాలను నిరాశకు గురి చేస్తున్నాయి. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన మణికం ఠాగూర్.. టీపీసీసీ చీఫ్ మార్పుపై మాట్లాడారు. ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు. పీసీసీ మార్పు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చాలామంది నేతల తరహాలోనే పాత మాట అనేశారు. 2014-2018 ఎన్నికల్లో జరిగిన విషయాలను నెమరేస్తూ రాబోయే ఎన్నికల్లోకి వెళ్తామని అన్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తేవడమే మా మిషన్ అని అన్నారు.పార్టీ అధికారంలోకి రావాలంటే టీమ్ వర్క్ అవసరమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి లీడర్లు ఉన్నారని.. పార్టీ అధికారంలోకి రావాలంటే పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 2023లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని స్టాండ్స్ తీసుకొని ఫాలో కావాల్సి ఉందని అన్నారు. పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతల మధ్య ఐక్యత ఉండాలని మణికం ఠాగూర్ అన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు అనేది క్రికెట్ టీమ్ లాంటిదని...అందరూ టీమ్ కోసం మాత్రమే అడుతారని అన్నారు. తాను వచ్చి కొన్ని రోజులే అవుతుందన్న మణికం ఠాగూర్.. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తానని అన్నారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదు అని రెండూ ఎమోషనల్ ఉన్న రాష్ట్రాలు అని అన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే స్టాటజీ ఉపయోగపడదని.. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉండాలని అన్నారు.

    మిగతా అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతర ఇన్‌ఛార్జ్ ఎన్ని చెప్పినా.. టీపీసీసీ చీఫ్ మార్పు ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్ వస్తే... పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందనే భావనలో పలువురు ఉన్నారు. ఓ వైపు బీజేపీ వంటి పార్టీ సైతం కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతుంటే.. తమ పార్టీ మాత్రం ఈ విషయంలో నాన్చడం ఏంటనే అభిప్రాయం కూడా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం కూడా టీపీసీసీ చీఫ్ మార్పు అంశంపై ప్రభావం చూపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్ మాటలను బట్టి ఇప్పుడప్పుడే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Manikam tagore, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు