భూరికార్డుల ప్రక్షాళన కోసం తెలంగాణ (Telangana) ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్(Dharani Portal)పై ముందు నుంచీ కొంత విమర్శలు ఉన్నాయి. అందులోని వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రైతుల సమస్యలు మరిన్ని పెరిగాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధరణి పోర్టల్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని భూసమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల సవరణ పేరుతో జరిగిన అవకతవకల విషయంలో సమగ్ర విచారణ జరపమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూవనరుల విభాగానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. భూవనరుల శాఖ కార్యదర్శిని కలిసి ధరణి పోర్టల్‌ని రద్దు చేయాలని కోరారు. ధరణిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేత హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి కూడా ఉన్నారు.
అనంతరం రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలన్నారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై తెలంగాణ సీఎస్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేసినట్లు ఆయన చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తోంది ప్రభుత్వం కాదని.. ప్రజల ఆస్తుల వివరాలను ప్రైవేట్ కంపెనీలకు కేసీఆర్ దారాదత్తం చేశారని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి.
తెలంగాణలోని భూసమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల సవరణ పేరుతో జరిగిన అవకతవకల విషయంలో సమగ్ర విచారణ జరపమని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ల్యాండ్ రిసోర్సెస్ సెక్రెటరీ గారిని కలిసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు, 1/1 pic.twitter.com/BHD7Usvmw9
— Telangana Congress (@INCTelangana) December 3, 2022
రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను సరళతరం చేయడంతో పాటు భూరికార్డులను పక్కాగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal).. మరిన్ని కొత్త సమస్యలను కారణమైంది. భూరికార్డుల్లో చాలా చోట్ల తప్పులు దొర్లాయి. భూయజమాని పేరు, సర్వే నెంబర్, భూవిస్తీర్ణానికి సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఐచ్ఛికాలను తీసుకొస్తోంది. ఐనప్పటికీ ఇప్పటికీ చాలా మంది రైతుల సమస్యల పరిష్కారం కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఫలితం ఉండలేదు. సమగ్ర భూసర్వే చేపట్టి.. తమ భూసమస్యలను పరిష్కారించాలని వేలాది రైతులు కోరుతున్నారు.
ధరణి పోర్టల్ వచ్చాక భూరికార్డుల్లో అక్రమాలు జరిగాయని.. ఎంతో విలువైన భూములను అధికార పార్టీ నేతలు కొట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Dharani Portal