Home /News /telangana /

TELANGANA CONGRESS LEADERS FIGHT IN THUNGATHURTHY CONSISTENCY HERE FULL DETAILS NS

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కొట్లాట.. ఆ కీలక నేతకు ఘోర అవమానం.. అసలేమైందంటే?

రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ (ఫొటోలు: ఫేస్ బుక్)

రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ (ఫొటోలు: ఫేస్ బుక్)

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో మరో కొత్త పంచాయితీ తెరమీదకు వచ్చింది. అయితే ఈ పంచాయితీ విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీనియర్ల వైపు ఉంటాడా? లేక యువనేతకు అండగా ఉంటాడా? అనే అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

  కాంగ్రెస్ (Congress Party) అంటేనే కొట్లాటలు అనే విషయం రాజకీయాలను పైపైన పట్టించుకునే వారికి కూడా తెలిసిన విషయమే. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం దీనిని అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ముద్దుగా చెప్పకుంటారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆ పార్టీలో కుమ్ములాటలు మరింతగా ఎక్కువయ్యాయి. సీనియర్లు, జూనియర్లు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్ పై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే ఈ పంచాయితీ తేలకుండానే కాంగ్రెస్ లో మరో కొత్త పంచాయితీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రమంతా ఎదురు గాలి వీచినా కూడా జిల్లాలోని రెండు రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈ కొత్త కుమ్ములాటకు వేధికైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  అద్దంకి దయాకర్.. టీవీల్లో రాజకీయ చర్చలు చూసే అందరికీ ఈ పేరు అత్యంత సుపరిచితం. కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నేతగా అద్దంకికి మంచి పేరు ఉంది. ఆయనలోని ఈ టాలెంట్ ను గుర్తించిన హైకమాండ్ రెండో సారి ఆయనను అధికార ప్రతినిధిగా సైతం నియమించింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి సైతం ఆయనను పంపిస్తూ ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం. ఇంతగా పేరు సంపాదించిన అద్దంకి దయాకర్ ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.

  ఆయన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో గెలుపుకు దూరమయ్యారు. అయితే, ఆ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అద్దంకి దయాకర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అద్దంకి దయాకర్ కేవలం ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంలోని వస్తాడని, తర్వాత మళ్లీ కనిపించడని రాంరెడ్డి వర్గీయులు ఆరోపిస్తుండగా.. తనను నియోజకవర్గంలో తిరగనీయకుండా దామోదర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన గతంలో పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.


  తుంగతుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి


  టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఫొటో లేకుండానే తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ


  అయితే, ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇద్దరు కలిసి తీసుకున్న సెల్ఫీ ఫొటోలు బయటకు రావడంతో వీరి మధ్య వివాదం ముగిసిందని అంతా భావించారు. అయితే, ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అద్దంకి దయాకర్ కు కనీసం ఆహ్వానం పంపించకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ అద్దంకి దయాకర్ ఫొటో ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన వర్గీయులు షాక్ కు గురయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు సైతం అద్దంకి దయాకర్ పై విమర్శల వర్షం కురిపించారు. నియోజకవర్గానికి రాని నేత తమకు అక్కర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అయితే ఈ విషయాన్ని అద్దంకి దయాకర్ ఘోర అవమానంగా భావించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ చీఫ్ దృష్టికి దయాకర్ ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. త్వరలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ విషయంపై అద్దంకి దయాకర్ తేల్చుకోకున్నట్లు సమాచారం. కావాలనే అద్దంకి దయాకర్ ను నియోజకవర్గానికి దూరం చేసే కుట్ర సాగుతోందని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ సమస్యను కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తాన్న అంశం తుంగతుర్తి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అద్దంకి దయాకర్ తో పాటు రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కూడా రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Revanth reddy, Tpcc, TS Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు