మరికాసేపట్లో తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. జ్వరం కారణంగా తన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్నారు. దీంతో గవర్నర్ తమిళిసై, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం ముచ్చింతల్‌లో జరగబోయే రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా ? లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలికే విషయమై నిన్నటి వరకు సస్పెన్స్ నెలకొన్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది కుమారుడి పెళ్లికి హాజరుకావాల్సి ఉన్న సీఎం కేసీఆర్.. అటు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది.
అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికి.. ఆయనతో పాటు హెలికాప్టర్లో ఇక్రిశాట్‌కు వెళ్లాల్సి ఉంది. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో 7 నిమిషాలు ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్‌కు వెళ్లాల్సి ఉంది. ముచ్చింతల్‌లో కేసీఆర్ 8 నిమిషాలు ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. అయితే కేసీఆర్‌కు జ్వరం రావడంతో చివరి నిమిషంలో ప్రధాని పర్యటనకు ఆయన దూరంగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు.
కొంతకాలంగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంపై ఆగ్రహంగా ఉంది. సీఎం కేసీఆర్ కేంద్రం, బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రదాని రాష్ట్రానికి వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారా ? ఆయనతో కలిసి పర్యటనలో పాల్గొంటారా ? అన్న దానిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రోటోకాల్ ప్రకారం జరిగే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ కూడా ఖరారైంది.
కొంతకాలంగా ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించి విఫలమవుతున్న సీఎం కేసీఆర్.. ఈ పర్యటన సందర్బంగా మోదీతో ఏ రకంగా వ్యవహరిస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రధానిని కేవలం ఆహ్వానించడం వరకే పరిమితమవుతారా ? లేక ఏమైనా చర్చిస్తారా ? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే జ్వరం కారణంగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.