ఎండిన నది సజీవంగా మారింది.. చుక్క నీరు లేని చోట నీరు గలగలా పారుతోంది.. గోదారమ్మ పులకరిస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని కళ్లారా చూడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరిని ఆయన నేడు సందర్శించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు గోదావరి నదిని ఏరియల్ వ్యూ ద్వారా తిలకించనున్నారు. ఉదయం 9.50 గంటలకు బేగంపేట నుంచి అధికారులు, ఇంజనీర్లతో సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 10.50 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు గోలివాడ పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. ఎల్లంపల్లి బ్యారేజీని సందర్శించిన అనంతరం గోలివాడ పంప్‌హౌస్ వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మపురికి వస్తారు. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:August 06, 2019, 08:15 IST