TELANGANA CM KCR WILL ANNOUNCE PRC TO EMPLOYEES IN THE SPAN OF TWO TO THREE DAYS IN ASSEMBLY AK
Telangana PRC: ఉద్యోగుల పీఆర్సీపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్
Telangana PRC: తెలంగాణ ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పామని.. ఆ హామీని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ విషయంలో గతంలోనే వారికి సానుకూల సంకేతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.. తాజాగా అసెంబ్లీ వేదికగా వారికి మరోసారి శుభవార్త వినిపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోనే రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వారికి గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని సీఎం కేసీఆర్.. వారిపై తమకు ఎంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పామని.. ఆ హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. తాను పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగులు కచ్చితంగా సంతృప్తి వ్యక్తం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కొద్దిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువగానే ఫిట్మెంట్ ఇవ్వడానికి సీఎం అన్నట్లు సమాచారం. దీంతో 29 శాతం మేర ఫిట్మెంట్ తో పీఆర్సీని అధికారికంగా ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. టీచర్లకు కూడా ఉద్యోగులతో పాటు పీఆర్సీని అమలు చేస్తామని సీఎం హమీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో పాటు ఉద్యోగలు పదవీ విరమణ వయస్సుపై సైతం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో.. పీఆర్సీపై త్వరలోనే ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.