TELANGANA CM KCR TO RECEIVE OPPNS PRESIDENTIAL CANDIDATE YASHWANT SINHA AT BEGUMPET AIRPORT JUST A COUPLE OF HRS BEFORE PM MODI LANDS AT THE SAME AIRPORT SK
CM KCR: మోదీ రాక.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్.. కానీ ప్రధాని కోసం కాదు
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్
CM KCR | PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లడం లేదు. ఆయనకు బదులుగా ఎప్పటిలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తారు. కానీ యశ్వంత్ సిన్హాకు మాత్రం సీఎం కేసీఆరే స్వయంగా స్వాగతం పలకనున్నారు.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National executive meeting 2022) జరగనున్నాయి. పార్టీ విస్తరణ, మోదీ పాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేదుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ (Hyderabad)లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వంటి అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ సీఎంలంతా హాజరవుతున్నారు. ఇవాళ మాదాపూర్ హెచ్ఐసీసీలో కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అంతా సిద్ధం చేశారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేసేందుకు కమలం నేతలు కంకణం కట్టుకున్నారు.
కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... బీజేపీకి కౌంటర్ ఇచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున గులాబీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బీజేపీ కూడా భారీగా ఫ్లెక్సీలు పెట్టింది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలతో నగరం మొత్తం కాషాయం, గులాబీ రంగులను పులుముకుంది. బీజేపీ కార్యవర్గ సమావేశాలను తక్కువ చేసి చూపించే క్రమంలోనే... టీఆర్ఎస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చేస్తున్న రోజే.. నగరంలో భారీ ర్యాలీని తలపెట్టింది. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగడానికి కొన్ని గంటల ముందే.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత సిన్హా (Yashwant Sinha) కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేసింది. యశ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్‌కు భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ర్యాలీ అనంతరం.. జలవిహార్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు. వారితో కలిసి భోజనం చేస్తారు.
ఐతే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే... ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ (CM KCR) బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లడం లేదు. ఆయనకు బదులుగా ఎప్పటిలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఆయనే స్వాగతం పలుకుతారు. గతంలో సమతా విగ్రహావిష్కరణ, ఐఎస్బీ వార్షికోత్సవ వేడుకలకు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్.. వెళ్లలేదు. అప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవే ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇవాళ కూడా ఆయనే స్వాగతం పలుకుతారు. కానీ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మాత్రం ఘన స్వాగతం పలకలాని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. ఆయనతో పాటు మంత్రులంతా యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలుకుతారు.
Telangana CM K Chandrashekar Rao to receive Oppn's presidential candidate Yashwant Sinha at Begumpet Airport just a couple of hrs before PM Modi lands at the same airport. Only one TRS Minister to receive PM while all ministers, incl CM, will receive Yashwant Sinha.
టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ.. ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం సీఎం కేసీఆర్‌కు లేదని కమలం నేతలు మండిపడుతున్నారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు సీఎంతో పాటు మంత్రులంతా వెళ్తారా.... ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు మాత్రం తలసాని ఒక్కడినే పంపిస్తారా? అని విరుచుకుపడుతున్నారు. ఇంత నీచ రాజకీయాలను గతంలో ఎప్పుడూ చూడలేదని గులాబీ దండుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.