తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఇవాళ తమిళనాడు పర్యటనకు బయలుదేరుతున్నారు. రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ టూర్ సాగనుంది. ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవారం రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే .స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్ర సర్కారుతో కేసీఆర్ యుద్దాన్ని ప్రకటించడం, జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును మళ్లీ ముమ్మరం చేస్తానన్న ప్రకటన, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం తమిళనాడు పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. వివరాలివి..
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో కలిసి సోమవారం తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 తిరుచిరపల్ల్లి విమానశ్రయంలో దిగి అనంతరం పది నిమిషాల్లో ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకుంటారు. ఆ హోటల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలు దేరి రంగనాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు.
శ్రీరంగం రగనాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం 3.10కి తిరిగి ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4.40 గంటలకు తిరుచిరపల్లి అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో చైన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోని హోటల్ ఐటిసిలో బస చేస్తారు. తమిళనాడు పర్యటనలో తొలి రోజు మొత్తం ఆథ్యాత్మికతకు కేటాయించనున్న సీఎం కేసీఆర్, రెండో రోజు మాత్రం రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు..
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అవుతారని సమాచారం. కేంద్రంపై ఇద్దరు సీఎంలూ ధిక్కార స్వరం వినిపిస్తుండటం, దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించే క్రమంలో పరస్పర సహకారం, ప్రాంతీయ పార్టీల ఐక్యత తదితర అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకోబోతున్నట్లు సమాచారం. స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే పార్టీ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ తో స్నేహం కొనసాగిస్తూ యూపీఏలో ప్రధాన భాగస్వామిగా ఉంది. కేసీఆర్ మాత్రం కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.