హోమ్ /వార్తలు /తెలంగాణ /

K Chandrashekar Rao: అంతా గోల్‌మాల్ గోవిందం.. కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్

K Chandrashekar Rao: అంతా గోల్‌మాల్ గోవిందం.. కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆరోపించారు.

  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల ఎవరికీ లాభం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం తరహాలో ఉందని మండిపడ్డారు. రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని లెక్కలను వివరిస్తూ తాను ఈ విషయాలు చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర బడ్జెట్‌లో పెట్టిన నిధుల కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులతో వారి సంక్షేమం కోసం పాటు పడుతోందని ఆయన అన్నారు. రైతులకు మేలు చేయకుండా ఎరువులు, యూరియా మీద సబ్సిడీ తగ్గించారని మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 25 వేల కోట్లు కోత విధించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ ఇది అని.. ఇప్పటికి ప్రజలకు వీరి నిజస్వరూపం అర్థమైందని అన్నారు.

  పనికిరాని గుజరాత్ మోడల్ అభివృద్ధిని పెద్దదిగా చూపించి.. నరేంద్రమోదీ దేశంలో అధికారంలోకి వచ్చారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందిపడ్డ పరిస్థితులు చూసిన తరువాత కూడా ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపరచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అన్నారు. ఆహార సబ్సిడీకి నిధులు తగ్గించారని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా ? అని ధ్వజమెత్తారు. ఫెరుగుతున్న దేశ సంపదకు కొందరికి కట్టబెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. దీనికి సంస్కరణలు అని చెబుతున్నారని అన్నారు.

  కేంద్ర ప్రభుత్వంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. వాటిని భర్తీ చేయకుండా తెలంగాణలో ధర్నాలు చేస్తామని బీజేపీ సిగ్గులేకుండా చెబుతోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకే సొంతమైన గోదావరి జలాలను కావేరి నదిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. విధేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో లక్షలు రూపాయలు వేస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన అనేక మంది పారిపోయేందుకు అవకాశం కల్పించిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలతో మాట్లాడకుండా కృష్ణా గోదావరి కావేరి నదుల అనుసంధానం చేస్తామని ఎలా ప్రకటిస్తారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో 65 వేల టీఎంసీల నీరు ఉందని.. అయినా దేశంలో కరువు ఉందంటే.. అది కేంద్రం చేతగానితనమని ఆరోపించారు.


  Also Read: KCR: ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేసీఆర్ లెక్కలేంటి ?.. బీజేపీకి షాక్ తగులుతుందా ?

  Also Read: Telangana Politics: అదే జరిగితే.. ఈటల రాజేందర్‌కు మరో షాక్ తగలనుందా..?

  కేంద్రం జలశక్తి మిషన్ అంటూ బోగస్ మాటలు చెబుతోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 4 కోట్ల మందికి మంచి నీరు అందించేందుకు తాము రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశామని.. మరి రూ. 140 కోట్ల మందికి నీరు ఇచ్చేందుకు రూ. 60 వేల కోట్లు సరిపోతాయా ? అని ప్రశ్నించారు. దీన్ని ఎలా నమ్మమంటారని అన్నారు. తాను ప్రతి అంశానికి సంబంధించి లెక్కలతో సహా వివరించానని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు