ఎవరికి ఓటు వేస్తే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. భగత్‌ను గెలిపించుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ సభ జరగొద్దని.. సాగర్ ప్రజలను తాను కలవొద్దని కొందరు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. పదవుల కోసం తెలంగాణను వదలుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే.. తెలంగాణ కోసం పదవులు వదులుకున్న చరిత్ర టీఆర్ఎస్‌ది అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మాట్లాడితే 30 ఏళ్లు అంటున్న జానారెడ్డి సాగర్‌లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందంటే.. అది టీఆర్ఎస్ వల్లే అని కేసీఆర్ అన్నారు.
గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనాథలా ఉండేదని.. ఇప్పుడు అదే తెలంగాణ దేశంలో నంబర్‌వన్ స్థానానికి దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాలు, వర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చూసుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు.
కొందరు కాంగ్రెస్ నేతలు తనకు ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అనడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. తనకు ఈ పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష అని అన్నారు. సాగర్ నియోజకవర్గానికి కనీసం ఓ డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని జానారెడ్డి.. ఇక్కడ అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో భగత్ గెలిచిన తరువాత తానే స్వయంగా సాగర్ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తానని సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు. సాగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని.. ఆ రకంగా సాగర్‌కు రెండు పదవులు వస్తాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.