Telangana: 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు.. వెంటనే అమలు చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటివరకు 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్నరుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

  • Share this:
    తెలంగాణ కేబినెట్ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులు, రైతు రుణమాఫీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు, వృద్ధాప్య పెన్షన్లపై సమావేశంలో చర్చించారు. వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇక దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

    ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటివరకు 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్నరుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందుకు అగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రుణ మాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. 25 వేల రుణమాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందారు.దీంతో ఇప్పటివరకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 9 లక్షలకు చేరనున్నది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగుతుందని కేబినెట్ నిర్ణయించింది.

    కేంద్రం ప్రవేశపెట్టిన ఇ డబ్లు ఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ కోటాకు, విద్యా ఉద్యోగ అవకాశాలలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులని కేబినెట్ తీర్మానించింది. ఇ డబ్లు ఎస్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితి లో 5 సంవత్సరాల సడలింపునివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

    తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల పత్తి సాగును రాష్ట్రవ్యాప్తంగా మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

    కేబినెట్ ఇతర కీలక నిర్ణయాల కోసం ఈ కింది స్టోరీని చదవండి:

     రైతుల రుణమాఫీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. తెలంగాణ  కేబినెట్ నిర్ణయాలు ఇవే
    Published by:Shiva Kumar Addula
    First published: