కల్నల్ సంతోష్‌కు సీఎం కేసీఆర్ నివాళి.. కుటుంబానికి రూ.5 కోట్ల సాయం

కల్నల్ సంతోష్ దేశం కోసం ప్రాణాలర్పించారని.. అలాంటి వీరుడిని ఇచ్చిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు తెలంగాణ సీఎం.

కల్నల్ సంతోష్ దేశం కోసం ప్రాణాలర్పించారని.. అలాంటి వీరుడిని ఇచ్చిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు తెలంగాణ సీఎం.

  • Share this:
    గాల్వన్ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూవులు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు.

    సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ ఒన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు తెలంగాణ సీఎం. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.

    ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ర్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

    ఇక గాల్వన్ ఘర్షణలో కల్నల్‌తో పాటు వీరమరణం పొందిన మిగతా 19 మంది జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే చెప్పారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని వెల్లడించారు. కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
    First published: