హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Heavy Rains: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. వరదలు వచ్చే ప్రమాదం.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Telangana Heavy Rains: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. వరదలు వచ్చే ప్రమాదం.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలిస్తున్న సీఎం కేసీఆర్

సమీక్షా సమావేశంలో అధికారులకు సూచనలిస్తున్న సీఎం కేసీఆర్

మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవలి కంటే ఎక్కువ స్థాయిలో వరదలు సంభవించే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) గోదావరి నది జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతోంది. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయి. పడ్డ చుక్క పడ్డట్టే వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటోంది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవలి కంటే ఎక్కువ స్థాయిలో వరదలు (Floods) సంభవించే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం అన్నారు.

ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉధృతంగా ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేవించారు. వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ & బీ, పురపాలక శాఖలు, మిషన్ భగీరథ బృందం అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.

పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎంకు వివరించారు.

భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు.


First published:

Tags: CM KCR, Godavari floods, Hyderabad Rains, Telangana rains