యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని (yadadri bhongir collectorate) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూముల రేట్లు వట్టిగనే పెరగలేదని.. తెలంగాణ వచ్చాకే ఇది జరిగిందని అన్నారు. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందని.. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను నాశనం చేశారని.. వాటర్ షెడ్డింగ్‌తో భూగర్భ జలాలు పెరిగాయని సీఎం తెలిపారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయని సీఎం హామీ ఇచ్చారు. దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎకరం రూ.25 లక్షలకు తక్కువగా లేదు..
సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ తన మాటల దాడిని కొనసాగించారు. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆ పిచ్చితోనే రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. చెత్త పాలసీలు తీసుకువచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎక్కడా ఎకరం భూమి రూ.25 లక్షలకు తక్కువగా లేదన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంచిర్యాలను జిల్లా చేస్తామన్నారని.. కానీ కుదరలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్‌లకు ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తోన్న భువనగిరికి చెందిన ఉషా రెడ్డిని ముఖ్యమంత్రి అందరికీ పరిచయం చేశారు.
తెలంగాణలో ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చెప్పారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో వుందని కేసీఆర్ తెలిపారు. పుట్టిన దగ్గరి నుంచి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. దేశం ఓ పక్క వెనక్కి పోతున్నా.. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందన్నారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగులు పైరవీలు చేసే పరిస్ధితి వుండకూడదని.. మా ఉద్యోగాలు మాకు కావాలి అనే నినాదం మనదని కేసీఆర్ గుర్తుచేశారు.
యాదాద్రి దేవాలయానికి సమీపంలో నిర్మించిన వీవీఐపీ ల విడిది ప్రెసిడెన్షియల్ విల్లాను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మంత్రులు జి. జగదీష్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా శుక్రవారం జనగామ జిల్లా బహిరంగ సభలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రంపై పోరాటాన్ని చేస్తానని ప్రకటించిన సీఎం ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వారికి పలు వరాలు కూడా ప్రకటించారు. జాతీయ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అనుమతిస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతానంటూ వ్యాఖ్యనించడం సీఎం కేసీఆర్ గత కొద్దికాలంగా చెబుతున్నట్టుగా జాతీయ రాజకీయల వైపు వెళతారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.