Telangana: వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana CM KCR: వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు, అనుభవం కలిగిన శిక్షణ పొందిన అధికారులతో కూడిన, ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు.

  • Share this:
    భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితులున్నందున అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను సిఎం ఆదేశించారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మారిన పరిస్థితుల్లో.. తెలంగాణ లో ఇక నుంచి కరువు పరిస్థితులు వుండవని, వరద పరిస్థితులను ఎదుర్కునే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉన్నతాధికారులకు సీఎం సూచించారు.

    తక్షణమే వరద పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలో తెలిసిన ఏడుగురితో కూడిన సమర్థవంతమైన వరద నిర్వహణ బృందం (ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్)ను ఏర్పాటు చేయాలని అన్నారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలమీద అవగాహన కల్పించబడిన ఉన్నతాధికారులను నియమించాలని తెలిపారు. ఈ టీంను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా.. పాత రికార్డ్ ను అనుసరించి ఆయా వరదల సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టేలా, ప్రతి సంవత్సరం వరదల రికార్డ్ ను పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీంలో నియమించబడే అధికారులకు ఉండాల్సిన అవగాహనను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. వారు, ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవిన్యూ, వైద్యశాఖ, జీఎడి శాఖల గురించిన అనుభవం కలిగిన వారై ఉండాలని తెలిపారు. ఈ సభ్యుల్లో వొకరు., లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ వారికి తక్షణ పునరావాస క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి వున్నవారై వుండాలని అన్నారు.

    ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ తదితర రక్షక వ్యవస్థలను అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను ఆదుకునేందుకు సమయస్పూర్తితో వ్యవహరించగలిగే వొక అధికారి ఉండాలని సిఎం అన్నారు.వైద్య శాఖ , రోడ్లు భవనాల శాఖ పంచాయితీ రాజ్ శాఖ ను సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితుల్లో యుద్ద ప్రాతిపదికన వ్యవహరించే అనుభవం వున్న అధికారిని వొకరిని నియమించుకోవాలన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ చర్యలను సమీక్షించుకుంటూ తక్షణ ఆదేశాలు వెలువడేలా ఉన్నతాధికారులతో వ్యవహరిస్తూ.. జీ ఏ డి, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ఫ్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారి మరొకరుండాలన్నారు. ఇట్లా వరద పరిస్తితిని ఎదుర్కునేందుకు, అనుభవం కలిగిన శిక్షణ పొందిన అధికారులతో కూడిన, ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు.

    కృష్ణా పరీవాహక ప్రాంతానికీ వరద ప్రమాదం
    ‘‘ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నవి. మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ర్ట్రాలనుంచి కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగే పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలి’’ అని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అందుకుగాను నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలన్నారు. రేపటి నుంచి నల్లగొండ ఇరిగేషన్ సీఈని నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ కోసం., వనపర్తి సీఈని జూరాల ప్రాజెక్టు పర్యవేక్షలో వుండాలన్నారు.

    హైద్రాబాద్ పరిస్థితి ఏంటి ?
    మూసీ నది వరద గురించి ఈ సందర్భంగా సిఎం ఆరా తీసారు. వరద ఉదృతి పెరిగే పరిస్థితిని అంచనా మూసి లోతట్టు లో నివాసం వుంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కటినంగా వ్యవహరించాలని, హెచ్ ఎం డిఎ, జీ హెచ్ ఏం సీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

    అగస్టు 10 దాకా అప్రమత్తంగా ఉండాలి
    అగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ...బ్రిడ్జీలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయినుంచి అందరు ప్రజాప్రతినిధులను ఇప్పటికే అప్రమత్తం చేశామని సిఎం తెలిపారు.

    వరదలతో సాహస కృత్యాలు వద్దు
    భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉధృతమౌతున్న పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. వాగులు వంకలు చెరువులు కుంటల వైపు సంచారం కూడదని, వరదల్లో చిక్కుకోకుండా ఉండాలని హెచ్చరించారు. వరద ఉదృతిలో వాగులు వంకలు దాటేందుకు సాహసకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని హితవు పలికారు. కుటుంబ పెద్దలు కుటుంబ సభ్యులను పిల్లలను వరదల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published: