• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA CM KCR CONDOLES EX PRESIDENT PRANAB MUKHERJEE DEATH SK

తెలంగాణతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ప్రణబ్ ముఖర్జీతో సీఎం కేసీఆర్

Pranab mukherjee: తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు.

  • Share this:
    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం గుర్తు చేసుకున్నారు.

    ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్‌కు) దక్కిందని అని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని సిఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు ప్రారంభంలో ప్రణబ్ ముఖర్జీకి ఆర్మీ ఆర్‌ఆర్ డాక్టర్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దాదాను బతికించేందుకు డాక్టర్లు అహర్నిశలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published: