హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Cabinet Decisions: సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినేట్ మొదటగా చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా కేబినేట్‌కు వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకొని, వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని కేబినెట్ సమీక్షించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలోని విద్యపై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులను ప్రాధమికస్థాయిలో ఇంగ్లీషు మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం రూపొందించాలని మరియు వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.

సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.

ఇక ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. పలు అంశాలను ఆమోదించింది. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లు, వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్దరణ పనులకు రూ.44.71 కోట్లు, మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్ పూర్ బ్రాంచి కాలువ పనులకు 144.43 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించబడిన ఘన్ పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థలో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోధించింది. వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రి వర్గం ఆమోదించింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Telangana: ఏపీలో బాటలో తెలంగాణ.. అందుకోసం రూ. రూ. 7289 కోట్ల కేటాయింపు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?

గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు; గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు; నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

First published:

Tags: CM KCR, Telangana, Telangana cabinet

ఉత్తమ కథలు