• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TELANGANA CM KCR ANGRY ON MARIYAMMA LOCKUP DEATH ISSUE KEY ORDERS TO DGP AND OTHERS AK

Telangana: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఈ లాకప్ డెత్‌కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Share this:
    దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ ఘటనపై నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చింతకానికి వెళ్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని ఆదేశించారు. సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

    దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నదన్న కేసీఆర్... ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో, ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వీటిని క్షమించబోమని.. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని అన్నారు. వారిపై తక్షణమే కఠిన చర్యలుంటాయని అన్నారు.

    ఈ లాకప్ డెత్‌కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదని అన్నారు. అవసరమైతే ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి అని డీజీపీని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖామంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: