Medaram Jatara 2020 : నేడు మేడారానికి సీఎం కేసీఆర్, ఇద్దరు గవర్నర్లు...

Medaram Jatara 2020 : మేడారం జాతర జరిగే నాలుగు రోజుల్లో ఈ రోజు అత్యంత కీలకమైనది. ఎక్కువ మంది భక్తులు వచ్చేది కూడా ఇవాళే. ఈ శుభ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ వన దేవతల్ని దర్శించుకోనున్నారు.

news18-telugu
Updated: February 7, 2020, 5:38 AM IST
Medaram Jatara 2020 : నేడు మేడారానికి సీఎం కేసీఆర్, ఇద్దరు గవర్నర్లు...
Medaram Jatara 2020 : నేడు మేడారానికి సీఎం కేసీఆర్, ఇద్దరు గవర్నర్లు... (credit - wikipedia commons)
  • Share this:
Medaram Jatara 2020 : లక్షల మంది భక్తుల రాకతో... భక్త జన సంద్రమైంది మేడారం. వనదేవతల్ని గద్దెలపై కొలువు దీర్చడంతో... సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న భక్తులతో మేడారం అత్యంత రద్దీగా మారింది. ఇదే సమయంలో... తెలంగాణ సీఎం కేసీఆర్... నేటి ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. రెండేళ్ల కిందట జరిగిన జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెల మీదకు చేరిన తర్వాతే సీఎం కేసీఆర్‌ వారిని దర్శించుకున్నారు. ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఐతే... తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఇవాళే మేడారం రాబోతున్నారు. సీఎం కేసీఆర్‌ కంటే గంట ముందే ఆమె వన దేవతల్ని దర్శించుకోనున్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.

ప్రస్తుతం మేడారంలో ఎటు చూసినా కనుచూపు మేర భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. అన్ని దారులూ మేడారానికే వెళ్తున్నాయి. అటువైపు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్లను తలపిస్తున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు... గద్దెల పైకి రాగా, గురువారం రాత్రి 9.10 గంటలకు సమ్మక్కను గద్దె ప్రతిష్టించారు. చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం ఉద్విగ్నభరితంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగింది. సమ్మక్క పూజారులను దైవాంశ సంభూతులుగా భావించి భక్తులు వారిని తాకేందుకు పోటీపడ్డారు. వారిని నిలువరించేందుకు రెండు రక్షణ వలయాలుగా పోలీసులు, తుడుందెబ్బ యువ సైన్యం రక్షణ కల్పించారు. 500 మంది పోలీసులు తాడుతో భద్రత కల్పించారు. సమ్మక్కను గద్దె పైకి తీసుకురావడంతో వన దేవతల కుటుంబమంతా మేడారం ఆలయంలోని గద్దెలపై కొలువైనట్లైంది. కోరిన కోరికలు తీర్చే అమ్మలను దర్శించుకోవడానికి భక్త కోటి తరలివస్తోంది. లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటూ, బంగారంతో మొక్కులు చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం ఐదుగురు తెలంగాణ మంత్రులు మేడారం జాతరను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం మేడారం వచ్చిన ఆయన జాతర ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భక్తులు మాత్రం గతంలో కంటే ఈసారి జాతర ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు.

 


First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading