భారత రత్న, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు (Died). జనవరిలో లతా మంగేష్కర్‌కి కరోనా సోకింది. అప్పటి నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో పాటు న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. క్రమంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఇవాళ ఉదయం 08.10 ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్ (Lata Mangeshkar) మృతిపట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు ఇతర అన్ని రంగాల ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకున్నా.. పాట రూపంలో ఎప్పటికీ ఉంటారని పేర్కొంటున్నారు. లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Telangana CM K Chandrasekhara Rao) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం..
ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని ఓ ప్రకటనలో సీఎం చెప్పారు. భారత దేశానికి లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతా జీ మరణం తో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్' ఆగిపోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.
నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు..
ఈ సందర్భంగా సీఎం ఓ ప్రకటనలో.. " 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్య గాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్ల ను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు, కానీ, సింగర్ గా లతా జీ సమయం ఇచ్చినంక నే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ .. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వం లో వోలలాడించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షినాది కి సంగీత సరిగమల వారధి.
హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన , తన గాత్రం లో ఉర్దూ భాష లోని గజల్ గమకాల సొబగులను లాతాజీ గాత్రం వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు, కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది." అని సీఎం స్మరించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Lata Mangeshkar