Telangana cabinet reshuffle: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ... ఎప్పుడంటే...

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ... ఎప్పుడంటే... (కేసీఆర్, కవిత - File Images)

Telangana cabinet reshuffle: ఓవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హడావుడి ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గాన్ని ఎప్పుడు పునర్వ్యవస్థీకరించబోతోంది? ఏయే మార్పులు రాబోతున్నాయి?

 • Share this:
  Telangana cabinet reshuffle: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన వార్త తెరపైకి వచ్చింది. అదే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక... దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు (KCR)... మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది. అది కూడా ఎప్పుడో కాదు. వచ్చే నెలలోనే అని తెలుస్తోంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. అలాగే మేలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలున్నాయి. అవి ముగిసిపోగానే... వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా... కేసీఆర్ నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కాల్స్ వెళ్లనున్నట్లు తెలిసింది. ఇదివరకు 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో... కేసీఆర్... ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్‌లో చేర్చుకున్నారు.

  తెరపైకి ఎవరెవరు పేర్లు వస్తున్నాయి?:
  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనగానే... ఎవరికి చోటు ఇస్తారు, ఎవరిని తొలగిస్తారు అనే చర్చ కామన్. ఈసారి విధాన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఈయన్ అసెంబ్లీ, విధాన సభలో ఎక్కడా సభ్యుడిగా లేరు), మాజీ మంత్రి, జడ్జెర్ల ఎమ్మెల్సీ సీ లక్ష్మా రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

  వాళ్లపేర్లతోపాటూ... కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఈమధ్యే నిజామాబాద్ స్థానిక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం నుంచి కొడుకు కల్వకుంట్ల తారాక రామారావు (KTR), మేనల్లుడు టి.హరీశ్ రావు... కేబినెట్‌లో మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా ఛాన్స్ ఇస్తే... కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు మరింతగా విమర్శల దాటిని పెంచే అవకాశం ఉంది అనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

  ఇక మరో సర్‌ప్రైజ్ ఏంటంటే... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీ దేవిని కూడా మంత్రిని చేస్తారని తెలుస్తోంది. ఆమె మొన్ననే పట్టబద్ధుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారని తెలిసింది.

  ఆ మంత్రులపై వేటు తప్పదా?
  సీఎం కేసీఆర్ ప్రధానంగా ముగ్గురు లేదా నలుగురు మంత్రులపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే... మరొకరు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది. మరికొందరిని కూడా తప్పించి... కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం కోరుకుంటున్నట్లు సమాచారం.

  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే... సమాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోక తప్పదు. ఈసారి కూడా కేసీఆర్... ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. ఐతే... చాలాసార్లు సమావేశాల్లో, కలెక్టర్ల కాన్ఫరెన్సుల్లో, అసెంబ్లీలో... తాను పనిచేసే మంత్రులకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు బెస్ట్ పెర్ఫార్మర్‌గా గుర్తింపు పొందారని తెలిసింది. ప్రతి 3 నెలలకు ఓసారి మంత్రుల పనితీరుపై నిఘావర్గాల నుంచి సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. వీటితోపాటూ... స్థానిక ఎన్నికల్లో పార్టీపై ప్రజల నుంచి వచ్చిన స్పందన... ఆయా నియోజక వర్గాల్లో మంత్రుల పనితీరు... ఇటీవలి ఎన్నికలు, GHMC ఎన్నికల్లో ఫలితాలు అన్నింటినీ కేసీఆర్ లెక్కలోకి తీసుకుంటున్నారని తెలిసింది. కేబినెట్‌లో మంత్రుల తొలగింపు, కొత్తవారికి అవకాశాలు అన్నీ ఈ అంశాల ఆధారంగానే నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి: Telangana Coronavirus: వామ్మో... వెయ్యి దాటేసిన తెలంగాణ కరోనా కొత్త కేసులు

  ఎమ్మెల్సీలుగా ఉన్న సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విజయసాగర్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీదుద్దీన్, చీఫ్ విప్ బోడుకూడి వెంకటేశ్వర్లు కాల పరిమితి ఈ సంవత్సరం జూన్ మొదటి వారానికి ముగుస్తుంది. సుఖేందర్ రెడ్డికి మరోసారి అవకాశం దాదాపు ఖరారైనట్లు అసెంబ్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీల నుంచి సీఎం... ఒకరిని మంత్రిగా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు మహ్మద్ మహ్మూద్ అలీ, సత్యవతి రాథోడ్... ఎమ్మెల్సీలుగా ఉంటూ... కేసీఆర్ కేబినెట్ టీమ్‌లో ఉన్నారు. ఒకవేళ వాణీ దేవీకి మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే... ఆమెను విధాన మండలి చైర్‌పర్సన్ లేదా ఉప-సభాపతి (vice-chairperson) చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావడానికి మరో నెల పట్టే ఛాన్సుంది. జరగబోయే ఎన్నికల ఫలితాలను బట్టీ... కేబినెట్ కూర్పులో మార్పులు, చేర్పులూ ఉండబోతున్నట్లు తెలిసింది.
  Published by:Krishna Kumar N
  First published: