హోమ్ /వార్తలు /తెలంగాణ /

CMKCR: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

CMKCR: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారా?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తారని..  అందుకే ఒకేరోజు కేబినేట్‌ భేటీ, టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అందుకే నిర్వహిస్తున్నారని.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. ఎజెండాలో మొత్తం 15 అంశాలు ఉన్నట్లు సమాచారం.  ఆగస్టు 15 నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా ఫించన్లు ఇస్తున్నారు. ఐతే వీటి సంఖ్యను మరింతగా పెంచే అవకాశముంది.  ఈ నెల 25 నుంచి బతుకమ్మ పండగ (Bathukamma) జరనున్న నేపథ్యంలో.. ఎప్పటిలాగే ఈసారి కూడా 1.33 కోట్ల చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ చీరల పంపిణీ తేదీలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంబం లేకుండా.. పోడు రైతులకు న్యాయం చేసేలా విచక్షణాధికారులను ఉపయోగించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చా? అని మంత్రివర్గంలో చర్చించనున్నారు.


  దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరు 17న తెలంగాణ భారత్‌లో విలీనమై 74 పూర్తై.. 75వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు చాటేలా కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. అనంతరం వజ్రోత్సవాలపై విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఇటీవల బిహార్‌ పర్యటనలో సీఎం కేసీఆర్ (CM KCRM Bihar Tour) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి అనుమతి  ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

  KCR: కేసీఆర్‌ అలాంటి నిర్ణయం తీసుకోనున్నారా ?.. బీజేపీకి ప్లస్సా ? మైనస్సా?

  వీటితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో పురోగతి, ధరణి సమస్యలు, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, వాయిదా పడిన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, విద్యుత్‌ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. అనంతరం కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.

  కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత.. సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం జరగనుంది. మునుగోడు ఉపఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపై గులాబీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని సమాచారం. కొత్త జాతీయ పార్టీపై ఇవాళ కీలక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మంత్రివర్గ భేటీతో పాటు టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశంపై నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తారని..  అందుకే ఒకేరోజు కేబినేట్‌ భేటీ, టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అందుకే నిర్వహిస్తున్నారని.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

  ఉత్తమ కథలు