ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet) కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఆసరా పెన్షన్లు, నిధుల సమీకరణ, యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు ముసాయిదా సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి అదనపు నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మంత్రివర్గం చర్చిస్తోంది. 2022-23 బడ్జెట్ లోటు 5వేల కోట్లుగా ఉండే అవకాశముందని.. దీని పూడ్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో కొత్త పెన్షన్లకు కూడా ఆమోదముద్ర వేయనుంది కేబినెట్. 57 ఏళ్లు వయసు దాటి..అర్హత కలిగిన వారందరికీ ఇక నుంచి పెన్షన్లు (Aasara pensions) ఇస్తారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచి కొత్త పించన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. కొత్తగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పించన్ ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది డయాలిసిస్ రోగులకు ప్రతి నెలా రూ.2,106 అందజేస్తారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో వృద్ధులతో పాటు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాల రోగులు కలిపి మొత్తం 36 లక్షల మందికి నెల నెలా పెన్షన్ ఇస్తున్నారు. ఐతే ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారికి, డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇవ్వనుండడంతో.. కొత్తగా 10 లక్షల మంది పెన్షనర్లు వచ్చారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ లెక్కల ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెలా 46 లక్షల మందికి పెన్షన్ అందజేస్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా.. సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేయనున్నారు. అనాథ పిల్లలను స్టేట్ చిల్ట్రన్‌గా డిక్లేర్ చేసి.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటారు. కేజీ నుంచి పీజీ వరకు విద్య అందించడమే కాకుండా... ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.
మరోవైపు కేబినెట్ సమావేశానికి ముందు.. ప్రగతి భవన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మునుగోడు ఉపఎన్నికపైనే (Munugode By Elections) వారితో చర్చించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు సీఎం కేసీఆర్. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? టికెట్ ఎవరికిస్తే గెలవచ్చు? అనే వివరాలపై ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా.. అందరూ కలిసి కట్టుగా పనిచేసి.. పార్టీ విజయానికి కృషి చేయాలని నల్గొండ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 21న మునుగోడు నియోజకవర్గంలో అమిత్ షా సభ జరగనుండగా.. అంతకంటే ముందే ఆగస్టు 19నే టీఆర్ఎస్ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara pension, CM KCR, Telangana cabinet