Telangana Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3 (రేపు) నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈసారి కూడా అలాగే జరుగుతాయని అనుకున్న కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ కు మధ్య కుదిరిన సయోధ్యతో బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం, మంత్రులు తమిళిసైని ఆహ్వానించడం జరిగిపోయాయి. దీనితో బడ్జెట్ సమావేశాల్లో ఈసారి గవర్నర్ ప్రసంగం (Governor Speech) ఉండబోతుంది. రేపు మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కానున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి గవర్నర్ ప్రసంగం ఎప్పుడు ఉండబోతుంది? బడ్జెట్ ఏ రోజున ప్రవేశ పెడతారు? బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గత సెషన్ కు కొనసాగింపుగానే ఈసారి అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జరగనున్నాయి. కౌన్సిల్ 18వ సెషన్ నాలుగో మీటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తొలిరోజే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Soundar Rajan) ప్రసంగించనున్నారు. తరువాత అసెంబ్లీ, కౌన్సిల్, BAC సమావేశాలు నిర్వహించి సెషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ..అసెంబ్లీ మండలిలో గవర్నర్ తీర్మానాలపై చర్చించనున్నారు.
ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశం..
ఫిబ్రవరి 6న అసెంబ్లీలో 2023-34 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు (Finance Minister Harish Rao) ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 6నఉదయం 11 గంటలకు శాసనసభలో మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక 7న బడ్జెట్ ను అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు. 8వ తేదీ నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించి బిల్లుల ఆమోదంతో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఈ సభలలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ బడ్జెట్ అంచనాలు ఇలా..
ఇక తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్ధిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున ఈమేర ఆర్ధిక వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు ఉండడంతో వ్యవసాయం, దళితబంధు, నిరుద్యోగం, కొత్త పథకాలు వంటి అంశాలకు కీలక స్థానం దక్కనున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2023, Telangana