Telangana budget 2023-24 : ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే దానిపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉండటం... ఎన్నో అంచనాలు పెరగడం.. తీరా బడ్జెట్ ప్రకటించాక.. నిరాశ చెందడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం.. ఊహాజనిత లెక్కలతో.. బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. కీలక రంగాలకు భారీగా కేటాయింపులు ప్రకటిస్తున్నాయి. కానీ అమల్లో ఆ నిధుల మంజూరు అలా జరగట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల బడ్జెట్ ఎలా ఉన్నా.. దాన్ని నమ్మాలంటే ప్రజలకు కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల... దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించి ఉంటారనే అంచనాలు ఉన్నాయి.
ఇవాళ ఉదయం 10.30 సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు .. అసెంబ్లీలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టి.. ప్రసంగిస్తారు. అటు శాసన మండలిలో ప్రశాంత్ రెడ్డి.. బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను నిన్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా... సంక్షేమం, సాగునీటిపారుదల, పేదరిక నిర్మూలన, అభివృద్ధి అంశాలపై ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలిసింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. అలాగే కీలక పథకాలైన దళితబంధు, రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిసింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి దాన్ని మరింత పెంచినట్లు తెలిసింది. ఇక వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటును 15 నుంచి 17 శాతం అంచనా వేసినట్లు తెలిసింది. ఇది చాలా ఎక్కువే అయినా... ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు ఉండటం వల్ల ఈ అంచనాలు వేసినట్లు తెలిసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి డిసెంబరు వరకు వచ్చిన రాబడిని లెక్కలోకి తీసుకుంటే... వచ్చే ఏడాది టాక్సుల ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వస్తాయనే అంచనా ఉంది. అలాగే ఇతర ఆదాయాల రూపంలో మరో రూ.1.5 లక్షల కోట్లు వస్తాయనే లెక్కలతో.. ఈ బడ్జెట్‌ని రూపొందించినట్లు తెలిసింది.
ఎన్నికలపై ప్రభావం :
ఏ రాష్ట్రంలోనైనా.. నాలుగేళ్ల పాలన కంటే.. చివరి సంవత్సరం చేసిన పాలన ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ఎన్నికలు రావడానికి ఇంకా దాదాపు 9 నెలల టైమ్ ఉంది. ఈ కాలంలో ప్రభుత్వం చూపించే చొరవ, తీసుకునే నిర్ణయాలు, చేసే అభివృద్ధి పనులు, అమలయ్యే పథకాలు.. ఓట్లు రాబట్టేందుకు వీలు కల్పిస్తాయి. ఈ అంశాల్ని లెక్కలోకి తీసుకోవడం వల్లే ఈసారి భారీ బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. మరి ఈ కేటాయింపులు.. కాగితాలకే పరిమితం కాకుండా.. ఆచరణలోకి వస్తేనే.. ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Telangana Budget, Telangana News