తెలంగాణ మొత్తం జనాభా 4కోట్లు దాటగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే శివార్లతో కలిపి దాదాపు 1.5కోట్ల మంది నివసిస్తున్నట్లు అంచనా. హైదరాబాద్ విశ్వనగరానికి ఏమాత్రం తక్కువకాదని గతంలోనే చెప్పిన సీఎం కేసీఆర్ సిటీలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవసరమైనంత వేగంగా పనులు జరుగుతున్నాయా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. జీహెచ్ఎంసీకి తనకంటూ దాదాపు రూ.6వేల బడ్జెట్ కలిగి ఉంది. మరి ఇంత పెద్ద నగరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కిందా? అంటే, ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి. తెలంగాణ బడ్జెట్ 2022లోనూ సంఖ్యాపరంగా సిటీకి కేటాయింపులు భారీగా కనిపిస్తున్నప్పటికీ అందులో మెజార్టీ వాటా ఒకే ఒక్క ప్రాజెక్టుకు ఉండటం గమనార్హం..
తెలంగాణ రాజధానిగానే కాకుండా దేశంలోనే ఐదో అతిపెద్ద మెట్రో నగరంగా హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే, కేసీఆర్ సర్కారు ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఐదారు లైన్లు తప్ప పెద్దగా ప్రస్తావన రాలేదు. రాష్ట్ర బడ్జెట్ విలువ రూ.2.56లక్షలు కాగా, ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్ కు స్థూలంగా రూ.4800 కోట్ల కేటాయింపులు జరిగాయి. అందులోనూ ఒక్క మెట్రో రైలు ప్రాజెక్టుకే రూ.2500కోట్లు కేటాయించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం బడ్జెట్ లో మూడు వేర్వేరు కేటాయింపులు ప్రకటించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. పాతబస్తీలో మెట్రో రైలు కోసం రూ.500 కోట్లు, మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అనుసంధానం చేయడానికి మరో రూ.500 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అభివృద్దికి ఇంకో రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మెట్రో రైలు కాకుండా..
తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ నగరానికి మెట్రో రైలుకు నిధులు కాకుండా మరో మూడు అంశాలకు మాత్రమే కేటాయిపులు దక్కాయి. హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీటి పథకానికి రూ. 300 కోట్లు కేటాయించారు. అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్ల నిధులు ప్రతిపాదించారు. అలాగే, హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను తీర్చేందుకు రూ. 1200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ కాకుండా ఇతర పట్టణాల విషయానికొస్తే..
కేసీఆర్ సర్కారు ఇవాళ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగతికి రూ.1394 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలకు కలిపి రూ.రూ.4724 కోట్లు ప్రతిపాదించింది. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 1602 నర్సరీలను ఏర్పాటు చేశామని, వెజ్-నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను నిర్మించడంతోపాటు అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.