Telangana Budget: 26 వరకూ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం వ్యూహాత్మకమా..

గవర్నర్ ప్రసంగం వ్యూహాత్మకమా.. (తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ప్రసంగం)

Telangana Budget 2021-22: ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రచ్చ రేపేలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఓ రేంజ్‌లో ఆగ్రహంగా ఉంది. నెక్ట్స్ ఎలా ఉంటుంది?

 • Share this:
  Telangana Budget 2021-22: రాష్ట్రాల గవర్నర్లు అసెంబ్లీల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగాలు చేసేటప్పుడు ఆ ప్రసంగాలు పూర్తిగా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయనీ... వాస్తవాలకు దూరంగా ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా... నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ప్రసంగంపైనా బీజేపీ వర్గాల నుంచి ఇదే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్న బీజేపీ... బడ్జెట్ సమావేశాల్లో కూడా దూకుడుగానే ఉండేలా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో... ఈ నెల 26 వరకూ సమావేశాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు.

  టార్గెట్ బీజేపీ?
  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై సోమవారం ఉదయం రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రగతితోపాటు రాజకీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందనీ... అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గవర్నర్ చెప్పారు. అలా అంటూనే తెలంగాణలో మత సామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అన్ని మతాలకూ సమాన ఆదరణ, న్యాయం లభిస్తోందని గవర్నర్ అన్నారు. ఇదే బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమను టార్గెట్ చేసేందుకే గవర్నర్‌తో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రసంగం చేయించిందనే విమర్శలు చేస్తున్నారు కమలనాథులు.


  తన ప్రసంగంలో గవర్నర్ మెడికల్ ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ఉందనీ... కరోనా కాలంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో మొదటి స్థానంలో నిలవగా, ఈ-ట్రాన్సాక్షన్లలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని గవర్నర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని, కొత్త మున్సిపల్‌, రెవెన్యూ చట్టంతో పాలనలో పూర్తి మార్పులు జరగనున్నాయని, ధరణి పోర్టల్‌ ద్వారా విప్లవాత్మక భూ సంస్కరణలు తెచ్చినట్లు తమిళిసై వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 15,252 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామనీ, హైదరాబాద్‌కు మేలు చేసేలా రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వస్తోందనీ, మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ సమస్యను పోగొట్టామనీ సైబర్‌ నేరాలకు చెక్ పెడుతున్నామనీ.. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 68 శాతం తెలంగాణలోనే ఉన్నాయని, సీసీ కెమెరాల వినియోగంపై హైదరాబాద్‌ ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉందని గవర్నర్ తెలిపారు.

  ఆర్థిక నిర్వహణలో సర్కారు క్రమశిక్షణ పాటిస్తోందనీ, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామనీ, భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి చేసి, త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పని మొదలుపెడతామని గవర్నర్ చెప్పారు. తెలంగాణలో 2.10 కోట్ల ఎకరాలు పంటల సాగులోకి వచ్చాయనీ, మొత్తం 39,36,521 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ.8,710 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రత ఊరిలో నర్సరీ, డంప్‌యార్డు, రైతువేదిక‌, స్మశాన‌వాటిక‌, హ‌రిత వ‌నాల్ని ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

  ఇది కూడా చదవండి: Decompose: భూమిలో కలిసిపోవడానికి ఏ వస్తువులకు ఎంతకాలం పడుతుందో తెలుసా?

  గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతికి సభలు సంతాప తీర్మానం ప్రవేశపెడతాయి. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతారు. 18న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడతారు.
  Published by:Krishna Kumar N
  First published: