Bonalu: ఏపీలో ఘనంగా తెలంగాణ బోనాల జాతర.. సీఎం జగన్‌కు ఆహ్వానం

బోనాలతో మహిళలు (ఫైల్)

బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బత్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లిని కోరింది. ఈ వేడుకలకు ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు భాగ్యనగర్ మహంకాలి బోనాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

 • Share this:
  తెలంగాణలో బోనాల పండగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. అమ్మారికి భోనాల సమర్పణ, పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు, డీజే ఆటపాటలతో సందడిగా ఉంటుంది. ఐతే గత ఏడాది కరోనా కారణంగా నిరాడంబరంగానే పండగ జరిగింది. కానీ ఈసారి ఘనంగా పండగను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోనాల ఉత్సవాల కింద వివిధ ఆలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.15 కోట్లు మంజూరు చేశారు. జూలై 11న గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో జంట నగరాల్లో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తారు. ఆగస్టు 1న పాత బస్తీతో పాటు ఇతర ప్రాంతాల ప్రజల్లో బోనాల వేడుకలు జరుగుతాయి. లాక్‌డౌన్ ముగియడంతో పాటు కరోనా కేసులు తగ్గిపోవడంతో ఈసారి వేడుకలు ఘనంగానే జరిగే అవకాశముంది.

  ఐతే ప్రతి ఏటా తెలంగాణ బోనాలను ఏపీలోనూ నిర్వహిస్తున్నారు. 2010 నుంచి ఈ వేడుకలు జరుపుతున్నారు. ఆషాడమాసంలో భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ బోనాలు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి కూడా జులై 18న విజయవాడలో బోనాల పండగ జరగనుంది. ఏపీలో వేడుల నిర్వహణ కోసం బోనాల ఉత్సవ కమిటీ శనివారం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించింది. బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని బత్తుల బల్వంత్ యాదవ్ నేతృత్వంలోని భాగ్యనగర్ బోనాల కమిటీ మంత్రి వెల్లంపల్లిని కోరింది. ఈ వేడుకలకు ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు భాగ్యనగర్ మహంకాలి బోనాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.


  తమ విజ్ఞప్తికి ఏపీ మంత్రి వెల్లంపల్లి సానుకూలంగా స్పందించినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. అలాగే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ దుర్గమ్మ దేవాలయం ఈవో, ఆలయ కమిటీ చైర్మన్‌లు, విజయవాడ పోలీసు కమిషనర్, ఏపీ సాంసృతిక శాఖ డైరెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జులై 30న పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఆషాడ మాసంలో అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని..ఈసారి కూడా హైదరాబాద్‌కు పట్టు వస్త్రాలు తీసుకురావాలని కోరారు. అందుకు దుర్గగుడి ఈవో తమ అంగీకారం తెలిపినట్లు భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ తెలిపింది.
  Published by:Shiva Kumar Addula
  First published: